జక్కన్న పంట పండింది.. ''ఉత్తమ అంతర్జాతీయ చిత్రం''గా బాహుబలి-2

గురువారం, 28 జూన్ 2018 (18:01 IST)
దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ''బాహుబలి ది కన్‌క్లూజన్'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. 2015లో బాహుబలి ది బిగినింగ్ మొదలు కాగా, ఇందుకు కొనసాగింపుగా.. బాహుబలి ది కన్‌క్లూజన్ తెరకెక్కింది. ఈ సినిమా కలెక్షన్లతో పాటు అవార్డు పంట పండించింది. 
 
తాజాగా ప్రతి ఏటా వివిధ జానర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలకు అకాడమీ ఆఫ్ సైన్స్‌ ఫిక్షన్‌, ఫాంటసీ అండ్‌ హారర్‌ ఫిల్మ్స్‌ అనే సంస్థ శాటరన్‌ అవార్డులను అందజేస్తుంది. ఫిబ్రవరి 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య విడుదలైన చిత్రాల్లో విశేషంగా ప్రేక్షకులను అలరించిన సినిమాలకు అవార్డులను ప్రదానం చేసింది. 
 
ఈ మేరకు బుధవారం జరిగిన 44వ శాటరన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ''బాహుబలి: ది కన్‌క్లూజన్‌'' ''ఉత్తమ అంతర్జాతీయ చిత్రం'' కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది. ఈ కేటగిరీలో మొత్తం ఆరు చిత్రాలు పోటీ పడగా, ''బాహుబలి2''కు అవార్డు దక్కింది. కాగా, రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి చిత్రం భారతీయ బాక్సాఫీస్‌ వద్ద మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రూ.1500కోట్లపైనే వసూళ్లు సాధించింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు