బాబు గోగినేని - ఈ పేరు తెలియని తెలుగువారు లేరు. ప్రజల్లోని మూఢ విశ్వాసాలను, నమ్మకాలను సొమ్ముచేసుకునే నకిలీ బాబాలు, వాస్తు మేధావులను చీల్చిచీల్చి చెండాడి; టివి ఛానళ్ల లైవ్ కార్యక్రమాల్లోనే అనేకమంది బండారం బట్టబయలు చేసిన ఆయన తక్కువ కాలంలోనే అనన్యమైన గుర్తింపును తెచ్చుకున్నారు. టివి ఛానళ్లలో బాబాలు, మత విశ్వాసాలు వంటి వాటిపై ఏ చర్చ జరిగినా గోనినేని తప్పక కనిపించే పరిస్థితి వచ్చింది. అటువంటి వ్యక్తి బిగ్‌బాస్ షోలోకి ప్రవేశించారు.
రెండు వారాలకుపైగా బిగ్‌బాస్ ఇంట్లో ఉంటున్నారు. ఆయన చివరిదాకా షోలో కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే తనదైన తర్కంతో ఇటు ఇంటి సభ్యులను, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను సాధ్యమైనంత త్వరగా షో నుంచి బయటకు రప్పించడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఇంతకీ బాబు గోగినేనిపై ఎవరు కుట్రలు చేస్తున్నారు? ఎందుకు కుట్రలు చేస్తున్నారు?
బాబు గోగినేని బిగ్‌బాస్ షో గెలవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేరు. షోలో గెలిస్తే ఆయన పాపులారిటీ మరింత పెరుగుతుంది. బయటకు వచ్చిన తరువాత గోనినేని మాట్లాడే ప్రతి మాటకు ఇప్పటికంటే కొన్ని రెట్లు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఆలకించే జనం పెరుగుతారు. అందుకే ఆయన షో గెలవకూడదు. అది జరగాలంటే ముందుగా ఆయన్ను జనంలో తక్కువ చేయాలి. ఆయన దేశద్రోహిగా, హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేయాలి. అలా చేయడం వల్ల జనంలో వ్యతిరేకత వచ్చి… ఆయనకు లభించే ఓట్లు తగ్గిపోతాయి. ఓట్లు తగ్గిపోతే షో నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇదీ బాబుపై జరుగుతున్న కుట్ర. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చినవాళ్లే షోలో గెలుస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎంతోకొంత తారుమారు ఉన్నా… తీవ్ర వ్యతిరేకత ఉన్నవాళ్లను షొలో కొనసాగించరు. అలాంటి వ్యతిరేకతను బాబుపై తీసుకొచ్చేందుకే… ఆయనపై దేశద్రోహం కేసులు బనాయించారన్న విమర్శలు వస్తున్నాయి. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న ఆయన్ను విచారించే అవకాశాలూ ఉన్నాయి. మొదటి సీజన్‌లో మాదకద్రవ్యాల కేసులో ముమైత్‌ఖాన్‌ను హైదరాబాద్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.