‘బాహుబలి-2’ నిర్మాతలకు సైబర్ నేరస్తుల బెదిరింపులు.. రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్

మంగళవారం, 16 మే 2017 (04:21 IST)
ఇంతవరకు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకే పరిమితమైన మాఫియా బెదిరింపులు టాలీవుడ్‌కీ పాకుతున్నట్లు కనిపిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ చిత్ర నిర్మాతలకు సైబర్‌ నేరగాళ్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. 
 
ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల వసూళ్లు దిశగా దూసుకెళ్తొన్న సందర్భంలో ఆ చిత్రాన్ని ఉపగ్రహం ద్వారా పైరసీ చేశామంటూ సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. 
 
తమకు రూ.2కోట్లు చెల్లించాలని నిర్మాతలను నేరగాళ్లు డిమాండ్‌ చేశారు. దీంతో సీసీఎస్‌ పోలీసులకు చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి పట్నాకు చెందిన రాహుల్‌ వర్మగా పోలీసులు గుర్తించారు. రాహుల్‌ వర్మతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టుచేశారు. నిందితుల్ని రేపు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

వెబ్దునియా పై చదవండి