తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరన్న వార్త తనను ఎంతగానో బాధించిందని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు (84) బుధవారం చెన్నైలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల అనేక మంది సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి చరిత్రలో నిలిచిపోయేలా యమగోల చిత్రాన్ని నిర్మించారన్నారు. అలాగే, తాను హీరోగా తల్లిదండ్రులు అనే సినిమాను తీశారని గుర్తుచేశారు. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరించిందని చెప్పారు. తాతినేని నిర్మాతల పక్షాన నిలబడేవారని, వారికి డబ్బులు మిగలాలని ఆలోచించే వారని చెప్పారు.
అలాగే సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడేవారు కాదని అన్నారు. బాలీవుడ్‌లోనూ ఆయన హిట్ సినిమాలు తీసి అక్కడ కూడా విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారని బాలకృష్ణ చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తాతినేని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.