త్వరలోనే టీడీపీలోకి భారీ వలసలు : గంటా శ్రీనివాస రావు
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (13:28 IST)
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. అధికార వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగానే వలసలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. ఇవి ఇపుడు అధికార వైకాపాలో కాక రేపుతున్నాయి.
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాస రావు సైలెంట్ అయిపోయారు. ఒక దశలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగింది. కానీ, ఆయన పార్టీ మారలేదుగానీ సైలెంట్‌గా ఉండిపోయారు.
అయితే, ఇటీవల జగన్ చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతో వైకాపాలో లుకలుకలు వెలుగు చూశాయి. అనేక మంది నేతలు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. మరికొందరు మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఇలాంటి తరుణంలో గంటా శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు అత్యంత కీలకంగా మారాయి. ఇటీవల పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రెస్మీట్ పెట్టారు. కొన్ని కీలక పాయింట్స్‌ను టచ్ చేశారు. సీఎం జగన్ చేపట్టిన రివ్యూ సమావేశానికి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకు హాజరుకాలేదంటూ ప్రశ్నించారు.
అంతేకాకుండా, విశాఖను రాజధాని చేస్తామని చెప్పిన సీఎం జగన్.. విశాఖ జిల్లాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని గంటా ప్రశ్నించారు. త్వరలోనే వైకాపా నుంచి భారీగా వలసలు ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు.