'పద్మావత్‌'కు సెగలు.. కత్తులతో ర్యాలీ.. చస్తామంటున్న మహిళలు...

మంగళవారం, 23 జనవరి 2018 (08:47 IST)
బాలీవుడ్ చిత్రం "పద్మావత్" సినిమా ప్రదర్శనకు అటు సెన్సార్ బోర్డు, ఇటు సుప్రీంకోర్టులు అనుమతిచ్చినప్పటికీ నిరసన సెగలు మాత్రం చల్లారడం లేదు. 'పద్మావత్‌ సినిమాను నిషేధిస్తారా.. మమ్మల్ని చావమంటారా?' అంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేనకు చెందిన మహిళలు కత్తులు పట్టారు. 
 
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో 'ఆత్మగౌరవం' పేరుతో ఖడ్గాలతో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ‘పద్మావత్‌’పై నిషేధం విధించాలని, లేదా తాము ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
అదీకూడా 1303వ సంవత్సరంలో రాణి పద్మిని, 16 వేల మంది రాజ్‌పుత్‌ మహిళలు ఆత్మాహుతికి పాల్పడినట్లు చరిత్ర చెపుతున్న చిత్తోర్‌గఢ్‌ కోట నుంచే ఈ ర్యాలీని ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాసిన వినతిపత్రాలను స్థానిక అధికారులకు సమర్పించారు. 
 
కాగా, పద్మావత్‌ చిత్ర విడుదలపై మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సుప్రీం కోర్టు గతవారం అనుమతివ్వగా, ఈ ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలంటూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు సోమవారం కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. ఈ పిటీషన్లపై మంగళవారం జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారించనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు