మిత్రమా.. రణమా? శరణమా? : చిరంజీవికి సవాల్ విసురుతున్న బాలకృష్ణ

ఆదివారం, 18 డిశెంబరు 2016 (15:21 IST)
తెలుగు సినీ చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతికి ఇద్దరు అగ్ర హీరోలు నువ్వానేనా అంటూ తలపడనున్నారు. వారిద్దరూ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి. మరొకరు యువరత్న బాలకృష్ణ. 
 
ఈ ఇద్దరు అగ్రహీరోలు నటిస్తున్న చిత్రాలు అత్యంత ప్రతిష్టాత్కమైనవే. ఎందుకంటే ఒకరు 150వ చిత్రంలో నటిస్తుండగా, మరొకరు 100వ చిత్రంలో నటిస్తున్నారు. అందుకే ఈ రెండు చిత్రాలు వీరిద్దరికి తమ సినీ కెరీర్‌లో మైలురాళ్లు వంటివే. అయితే, చిరంజీవి చాలా విరామం తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. ఈయన నటిస్తున్న చిత్రం పేరు "ఖైదీ నెం.150". ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలై యూట్యాబ్‌లో హల్‌చల్ చేస్తోంది. 'బాస్ ఈజ్ బ్యాక్' పేరుతో నెటిజన్ల మనసులు కొల్లగొట్టింది. 
 
ఇకపోతే.. బాలకృష్ణ చిత్రం పేరు "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పైగా, ఈ రెండు చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు చెందిన టీజర్, ట్రైలర్లు సందడి చేస్తుంటే.. ఇక సినిమాలు ఏ రేంజ్‌లో ఆలరిస్తాయోనన్న అంచనాల్లో ప్రేక్షకులు ఉన్నారు. 
 
ఇకపోతే.. యూట్యూబ్‌లో వ్యూస్‌‌లో మాత్రం చిరంజీవి కంటే బాలకృష్ణ పైచేయి సాధించేలా ఉన్నారు. చిరు సినిమా ఖైదీ నెం.150 టీజర్‌కు కూడా విశేష ఆదరణ లభించింది. అయితే, ఈ టీజర్ విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటిదాకా వచ్చిన యూట్యూబ్ వ్యూస్ 55 లక్షలు మాత్రమే. 
 
కానీ, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ విడుదలై రెండు రోజులు కూడా పూర్తికాక ముందే 32 లక్షలకు పైగా వ్యూస్ కొల్లగొట్టింది. అంటే బాలయ్య స్టామినా ఏంటో ట్రైలర్ మరోసారి నిరూపించిందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. బాలయ్య సినిమాతో పోలిస్తే చిరు రికార్డు చెదిరిపోక తప్పదని వారంటున్నారు. 
 
పైగా.. శాతకర్ణిలోని ఓ డైలాగ్‌ను ఉటంకిస్తూ... మిత్రమా.. రణమా? శరణమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్‌కు, టీజర్‌కే ఇంత రెస్సాన్స్ వస్తే ఇక ఈ రెండు సినిమాలు విడుదలయితే థియేటర్లు చాలారోజులు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు సినీ ప్రేక్షకులు. 

వెబ్దునియా పై చదవండి