ఆ చిత్రానికి ముందే యూఎస్‌.లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేశా - వరుణ్ తేజ్

గురువారం, 17 మార్చి 2022 (15:43 IST)
Kiran, Sai Manjrekar, Aravind, Varuntej, Allu Bobby
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. గురువారం హైద‌రాబాద్ సినీమేక్స్‌లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..' బాక్సింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ తో కూడుకున్న ఎమోషనల్ కథ. ఈ నేపథ్యంలో సినిమా చేస్తాము అని చెప్పినప్పుడు ఎందుకు తీసుకున్నారో అనుకున్నాను. ఆ తర్వాత కేవలం బాక్సింగ్ మీద నడిచే 2,3 ఇంగ్లీష్ సినిమాలు చూశాను. ఈ సినిమా గురించి ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నాడు వరుణ్ తేజ్. దర్శకుడు కిరణ్‌తో కూర్చుని ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అల్లు బాబి సిద్ధూ ముద్ద ఇద్దరు మంచి స్నేహితులు వాళ్లకు ఏదైనా మంచి సినిమా చేయాలి అని తన స్నేహితుడు కిరణ్‌ను దర్శకుడిగా పరిచయం చేశాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ ఉన్నా కూడా ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఖచ్చితంగా దీన్ని చూడటానికి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. వస్తారు అని నమ్మకం కూడా ఉంది. ఇందులో కేవలం వరుణ్ తేజ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా 50 శాతం కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకున్నాడు. ఈ టీమ్ అంతా కలిసి చేసిన ప్రయత్నం కచ్చితంగా విజయం సాధిస్తుంది..' అని తెలిపారు.
 
హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా కోసం ఏదైనా చేస్తాను. కరోనా సమయంలో కూడా కష్టపడి ఈ సినిమా చేశాము. కచ్చితంగా ఇది మనల్ని అలరిస్తుంది అని నమ్ముతున్నాను. గద్దలకొండ గణేష్ సినిమా ముందు నుంచే యూఎస్.లో బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్‌గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.
 
నిర్మాతల్లో ఒకరైన సిద్ధ ముద్ద మాట్లాడుతూ..' ఈ సినిమాకు నాకు అవకాశం వచ్చింది వరుణ్ తేజ్. నన్ను, దర్శకుడు కిరణ్, బాబి.. ముగ్గురిని బాగా సపోర్ట్ చేసాడు వరుణ్. కోవిడ్ టైమ్స్ లో కూడా ధైర్యం ఇచ్చాడు. ఇక అల్లు అరవింద్ గారు మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది..' అని తెలిపారు.
 
దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ..' నాది వరుణ్ తేజ్ ది ఐదేళ్ల జర్నీ. బాక్సింగ్ నేపథ్యంలో ఒక కథ కావాలి అని తయారు చేసాము. అల్లు అరవింద్ గారి లాంటి నిర్మాత అండగా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎంత పెద్ద నటీనటులు కావాలనుకున్న ఆయన వెంటనే అరేంజ్ చేశారు. అలా ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, జగపతిబాబు లాంటి వాళ్ళు వచ్చారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. మా ఐడియాలను స్క్రీన్ మీద తీసుకురావడానికి ఫైట్ మాస్టర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులకు కూడా మా కష్టం కనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది..' అని తెలిపారు.
నటీనటులు: 
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు