సినిమా జీవులు రాజకీయాలు మాట్లాడకూడదా, సినిమాలు తీయడం, లాభాలకోసం పాట్లు పడటం తప్ప వారికి రాజకీయాలతో పని లేదా అంటే మంచు విష్ణు ఒప్పుకునేటట్లు లేడు. రేపు విడుదల కాబోతున్న తన సినిమా లక్కున్నోడు ప్రెస్ మీట్ మంగళవారం జరిగిన సందర్భంగా ఆ సినిమా విశేషాలతోపాటు చాలా విషయాలు పంచుకున్నారు మంచు విష్ణు. పెద్ద నోట్ల రద్దు అంశం మీదే ఈ సినిమా తీశామని, అత్యాధునిక టెక్నాలజీ వాడామని, శ్రోతల మైండ్ సెట్ మార్చాలంటే ఆ కెపాసిటీ దర్శకులకు మాత్రమే సాధ్యమని, వారివల్లే తెలుగు సినిమా దశ, దిశా మారతోందని వీలైనంత వరతు మంచి మాటలే చెప్పారు విష్ణు.
కానీ ఉన్నట్లుండి తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం గురించి ప్రశ్నించగానే దానిపై చాలా పాజిటివ్‌గా మాట్లాడారు విష్ణు. శాంతియుతంగా జరిగింది కాబట్టే జల్లికట్టు ఉద్యమం అంత విజయం సాధించిందని పేర్కొన్నారు. కాని అంతలోనే తనకు జల్లికట్టు సమస్యే కాదని అంతకంటే పెద్ద సమస్య తన దృష్టిలో దేశం రెండుగా విడిపోవడమేనని విష్ణు బాంబు పేల్చారు.
దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్లు దక్షిణాది ప్రజలను, ఉత్తరాది ప్రజలను వేరువేరుగా చూస్తున్నారని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా వివక్ష చూపటం కంటే వారు దేశాన్ని రెండుగా చీలిస్తేనే బాగుంటుంది అనేశారు. వినడానికి ఇది రెచ్చగొట్టేటట్టు ఉన్నా విష్ణు చెప్పిందాంట్లో వాస్తవం కొంతయినా లేదా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
శతాబ్దాలుగా తమిళుల సంప్రదాయ క్రీడగా కొనసాగుతున్న జల్లికట్టుపట్ల కేంద్రం పాటించిన వివక్షతే కదా తమిళనాడులో మంటలు పుట్టించింది? విష్ణు మాటలను యధాతథంగా తీసుకోవలసిన అవసరం లేకున్నా.. దక్షిణాది ప్రజల్లో పాలకులు తమను వేరుగా చూస్తున్నారన్న ఫీలింగ్ చాలాసార్లు కలుగుతూనే ఉంది. ఒక సినిమ నటుడు దేశ విభజన గురించి ఇంత తీవ్ర వ్యాఖ్య చేశాడే అని ఆవేశపడటం కాకుండా దేశంలో భాగంగా ఉన్న ప్రాంతాల పట్ల వివక్ష ఉందా లేదా అన్నది పాలకులు మథనం చేసుకుంటే బాగుంటుంది కదా..