పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజమండ్రిలో జనసేన నిర్వహించిన సమావేశంలో ప్రజారాజ్యం పతనం గురించి నోరు విప్పారు. అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైయ్యారు. పీఆర్పీ ఆఫీసులోనే చిరంజీవిని తీవ్రంగా విమర్శలు గుప్పించి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన పరకాల ప్రభాకర్ తీరు పట్ల పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అంతేగాకుండా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై కూడా పవన్ సూటిపోటీ మాటలతో దెప్పిపొడిచారు. పీఆర్పీ తరపున ప్రచారం చేసే సమయంలో అల్లు అరవింద్ ఎలా వ్యవహరించారో కూడా చెప్పేశారు. చెర్రీ, అల్లు అర్జున్‌లా తనను కూడా ఓ సినిమా హీరోగానే చూశారన్నారు. అంతేగానీ తనలోని సామాజిక స్పృహను ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే కన్నీళ్లు బయటికి రానీయకుండా ఏడ్చానని చెప్పారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో ఎవ్వరూ తన మాట వినలేదన్నారు.
విలీనాన్ని ఆపేందుకు అల్లు అరవింద్ ప్రయత్నించి ఉంటే బాగుండేదన్నారు. ఆయనకు పీఆర్పీ మీద ప్రేమ లేదన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. అందుకే పవన్ కల్యాణ్ అల్లు ఫ్యామిలీతో అంటీముట్టనట్లు వుంటారని పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలపై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి స్పందించాడు.
పవన్‌పై విమర్శలు చేయడం.. పవన్ ఫ్యాన్స్‌తో తిట్టించుకోవడాన్ని పనిగా పెట్టుకున్న కత్తి.. పవన్ అల్లు అరవింద్‌పై చేసిన కామెంట్స్‌ను హైలైట్ చేస్తూ.. ''ఏడవటం తప్పు కాదు పవన్.. చేతకాక, చెప్పుకోలేక ఏడవటం తప్పు. ఆ విషయం ఇప్పుడు చెప్పి.. అల్లు అరవింద్ మీద పడి ఏడవటం అంతకంటే తప్పు'' అంటూ ట్వీట్ చేశాడు.
కత్తి చేసిన ట్వీట్లకు అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌లో కీలక వ్యక్తి అయిన బన్నీవాసు కత్తి మహేష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'అయ్య బాబోయ్... కుటుంబంలో పుల్లలు పెట్టే పనులు వద్దు. పవన్ ఏం అన్నారో మాకు తెలుసు. ఆయన మాటలకు అర్థం ఏమిటో కూడా మాకు తెలుసు. ఉల్లికి లేని దురద కత్తికి ఎందుకు?" అంటూ కౌంటరిచ్చారు.
ఇంకా పవన్ అభిమానులు కత్తి సుత్తిని పట్టించుకోవద్దు అన్నారు. మార్కెట్లో కత్తులు, సుత్తులు వుంటాయి. వాటిని పట్టించుకోవద్దు అని బన్నీ వాసు సెటైర్లు విసిరారు. అనవసరంగా కత్తిని టార్గెట్ చేసి ఆయనకు పబ్లిసిటీ సంపాదించి పెట్టవద్దని బన్నీ వాసు పవన్ ఫ్యాన్సుకు సూచించారు.