నీ చిత్రంలో పాక్ నటులున్నారుగా...? అందుకే అందుకో నా రూ.320 చెక్.. కరణ్ జోహార్ షాక్

మంగళవారం, 25 అక్టోబరు 2016 (15:42 IST)
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఏ పని చేసినా ఇప్పుడు అతడికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. తాజాగా అతడు చేసిన పనికి మరో పెద్ద షాక్ తగిలింది. అదేంటయా అంటే... "ఏ దిల్ హై ముష్కిల్" చిత్రం రూపొందించినపుడు భారత్-పాక్ పరిస్థితులు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయనీ, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందనీ, అందువల్ల పాకిస్తాన్ నటులు ఉన్నారంటూ తన చిత్రం పైన ఆరోపణలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. 
 
ఐతే... తనకు దేశభక్తి చాలా ఎక్కువనీ, తనతోపాటు ఎంతోమంది భారతీయ టెక్నీషియన్లు పనిచేస్తున్నారంటూ వెల్లడించిన కరణ్... ఈ చిత్రం విడుదల కాకపోతే తలెత్తే నష్టం ఏమిటో చెపుతూ ఓ వీడియోను విడుదల చేసాడు. ఈ వీడియో యూ- ట్యూబులో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన ఓ వ్యాపారవేత్త కరణ్ జోహార్ కూ ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు. రూ. 320 చెక్కును కరణ్ జోహార్ కు పంపిస్తూ దానితో పాటు ఇలా రాశాడు. 
 
మిస్టర్ కరణ్ జోహార్... చిత్రం గురించి విడుదల చేసిన వీడియోను చూసి బాధ కలిగింది. మీతోపాటు మీ చిత్రంలో పనిచేసినవారంతా నష్టపోకూడదన్న ఉద్దేశ్యంతో ఈ డబ్బును మీకు పంపిస్తున్నా. పాకిస్తాన్ నటులున్న చిత్రాన్ని నేను చూడదలచుకోలేదు. నేను చూడకపోతే ఆ డబ్బు మీకు రాదు. అలా మీరు నష్టపోకూడదు. కాబట్టి నేను కొనే రెండు టిక్కెట్ల డబ్బు రూ.320 మీకు పంపుతున్నా. స్వీకరించండి అంటూ పేర్కొన్నాడు. కాగా కరణ్ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది.

వెబ్దునియా పై చదవండి