సినారే కలం నుంచి పగలే వెన్నెలా, జగమే ఊయలా పాట అలా పుట్టింది
మంగళవారం, 13 జూన్ 2017 (07:43 IST)
సాహిత్యంలోకాని, సినిమాలో కాని సగటు పాఠకుణ్ణి, కాస్త పైస్థాయి పాఠకుణ్ణి మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినారె రచన చేయగలరు అని ఎన్టీఆర్ కనిపెట్టారు. ఎన్టీ రామారావు పట్టుపట్టి ఇద్దరు కవులను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఒకరు సినారె. మరొకరు వేటూరి. ఇద్దరూ ఎన్టీఆర్ ఆశీస్సులతో రంగంలో నిలబడినవారే. ఆబాలగోపాలానికీ తమ బలం నిరూపించినవారే. గులేబకావళి చిత్రంలో అన్ని పాటలూ రాయడం ద్వారా చిత్రసీమలో కాలిడిన సీనారె ఆ ఒక్క సినిమాతోటే తన సత్తా నిరూపించుకున్నారు కానీ ఆయన అసలైన సత్తా ఏమిటో ఆనాటి మేటి దర్శకుడు బీఎన్ రెడ్డి పెట్టిన పరీక్షలోనే బయటపడింది.
అప్పటికే దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి కవుల చేతి పానకాలనీ మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి ఉద్దండుల పాయసాలను రుచి చూసినవారు బీఎన్ రెడ్డి. ‘పూజాఫలం’ సినిమాకు సినారెను పిలిచి లిట్మస్ టెస్ట్ పెట్టారు. ఎందుకంటే బి.ఎన్.రెడ్డికి పాట రాసినవాడు ఎవరికైనా రాయగలడు. ఏ టెస్ట్ అయినా పాస్ కాగలడు. పైగా సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. ఇద్దరు మేధావుల మధ్య సినారె. భళారె అని అనిపించుకోక తప్పదు. సందర్భం చెప్పారు. పియానో పాట. పియానో రీడ్స్ మీద జమున వేళ్లు కదలాడిస్తూ పాట పాడాలి. సినారె వేళ్లు కూడా పేపర్ మీద కదలాడుతూ పాట రాశాయి.
పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే.... పాస్ అయ్యాడు గురుడు. మరి? వచ్చింది ఎవరు? శబ్ద మేధావి.. గద్య మేధావి... సందర్భానుసారంగా సృజనను మెరిపించగల కలం మేధావి. కాని ఆ పాట కాదు. అంతకన్నా సుందరమైన లలితమైన భావం అవసరమైన పాట అదే సినిమాలో మరో చోట అవసరమైంది. కలం నిదుర లేచింది. నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో నిదుర లేచెనెందుకో... సినారె వచ్చాడట... బి.ఎన్.కు రాశాడట... సాలూరి ట్యూన్ కట్టాడట... ట్రైనింగ్ పూర్తయ్యి జాబ్ రెగ్యులరైజ్ అయ్యింది. ఇక మిగిలిందంతా కెరీరే.
తెలుగు చలనచిత్రంలో అసభ్యతకు తావియ్యని, లలిత లలిత పదాలతో అలవోకగా పాటల్ని అల్లగల ఒక గొప్ప కలం మొదట ఎన్టీఆర్, తర్వాత బీఎన్ రెడ్డి ద్వారా ఊపిరిపోసుకుంది.