గవర్నర్ విందు.. ఒకేచోట కలిసిన అన్నయ్య-తమ్ముడు.. సెల్ఫీ వైరల్

సోమవారం, 25 డిశెంబరు 2017 (11:05 IST)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చిన వేళ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కలిశారు. శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు గవర్నర్ విందు ఇచ్చారు. ఈ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలాకాలం తరువాత మరోసారి కలిశారు. 
 
వీరిద్దరూ కలిసి సరదాగా ముచ్చటించుకున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరైన ఈ విందుకు సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. ఈ విందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి దంపతులతో పవన్ కల్యాణ్ ఫోటో దిగారు. 
 
అలాగే రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు విచ్చేసిన పవన్ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్ కూడా ముచ్చటించారు. ఈ విందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. అన్నయ్య చిరంజీవిని తమ్ముడు పవన్ కలిశారు. పరస్పరం ముచ్చటించుకున్నారు. వీరిద్దరూ కొంచెం సేపు సందడి చేశారు. సెల్ఫీలు దిగారు. అనంతరం, ఏపీ సీఎం చంద్రబాబుతో చిరంజీవి మాట్లాడుతుండగా, కేసీఆర్ కూడా వారితో కలిశారు. అయితే అన్నయ్య, తమ్ముడు కలిసిన వేళ తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు