ఏపీ పోలీసులు వాళ్లకు అనుకూలమైన చోట పర్మిషన్ ఇస్తారు : చిరంజీవి

ఆదివారం, 8 జనవరి 2023 (14:30 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. శృతిహాసన్ హీరోయిన్. బాబి కొల్లి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై తెరకెక్కింది. ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను విశాఖ కేంద్రంగా ఆదివారం సాయంత్రం నిర్వహిస్తుంది. ఇందుకోసం హీరో చిరంజీవి హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరి వెళ్లారు. తన కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి విశాఖకు వెళ్లారు. 
 
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన క్లుప్తంగా సమాధానాలు ఇచ్చారు. వాల్తేరు వీరయ్య చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయన్న ప్రశ్నకు చిరంజీవి సమాధానమిస్తూ, ప్రతి ఒక్కరి అంచనాలు అందుకునేలా చిత్రం ఉంటుందన్నారు. 
 
అయితే, ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక మార్చడంపై ఆయన స్పందించలేదు. ముందుగా ఈ ఈవెంట్‌ను ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, వైజాగా పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. దీంతో ఈ వేదికను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి మార్చారు. 
 
ప్రభుత్వ నిర్ణయంపై తానేమీ మాట్లాడలేనని చెప్పారు. వాళ్లకు అనుకూలమైన చోట పర్మిషన్ ఇస్తారని మాత్రమే కామెంట్ చేశారు. మరోవైపు, ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల కోసం అవసరమైతే వాలంటీర్లుగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అభిమానులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు