ఎల్‌.వి.ప్ర‌సాద్ అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాన్ని తెర‌కెక్కించాలి : డి సురేష్ బాబు

గురువారం, 6 అక్టోబరు 2016 (11:55 IST)
తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' పుట్టింది 1932లోనైతే ఆ తరువాత ఓ పదేళ్లకు పైగా తెలుగు సినిమాలు పూర్తిగా రంగస్థల నాటకాల తరహాలోనే చిత్రీకరణ జరుపుకుని మూస ధోరణిలోనే ముందుకు సాగాయి. సినిమా కథ, కథనాలు, నటన, చిత్రీకరణల్లో తొలి మార్పులు తెచ్చింది బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డిలు. ఆ శైలిని దాటి ఒకడుగు ముందుకు వేసి సినిమా అనేది నాటకాల శైలిని దాటి నటన, సంభాషణల్లో సహజత్వమూ, సినిమాటిక్‌ పిక్చరైజేషన్‌ జరుపుకుని తెర మీదికి వచ్చిన తొలి సినిమా 'గృహప్రవేశం'. 
 
తెలుగు సినిమాకు సరికొత్త పోకడల్ని మలిచి నగిషీలు దిద్దిన ఎల్‌.వి ప్రసాద్‌ దర్శకునిగా తొలి సినిమా కూడా అదే. ఓ సీరియెస్‌ కథను తేలికగా చెప్పే 'బాంబే టెక్నిక్‌'ను తొలిసారి వాడి తెలుగులో విజయవంతం చేయడం అప్పట్లో సంచలనం. 1946లో విడుదలైన 'గృహప్రవేశం' సినిమా ఈ ఏడాది అక్టోబర్‌ 4న 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గృహప్రవేశం 70 వసంతాల వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, జమున, కృష్ణవేణి, సాయిచంద్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. 
 
ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ.. తొలి త‌రం ద‌ర్శ‌క నిర్మాత ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారు రూపొందించిన సినిమా గృహ‌ప్ర‌వేశం. ఆరోజుల్లోనే స్త్రీ ఆధిప‌త్యాన్ని స‌హించ‌లేని హీరో, స్త్రీలే అన్నింట్లో ముందుండాలి అనుకునే హీరోయిన్ ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య ఒక విల‌న్ మ‌ధ్య జ‌రిగే క‌థ‌. ఉద్ధండులు ఈ సినిమాలో పనిచేశారు. కె.య‌స్‌.ప్ర‌కాష్‌రావు అప్ప‌టికీ, ఇప్ప‌టికీ తెలుగు సినిమా స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా మిగిలిపోతారు. అలాగే నేను ఇదెక్క‌డి న్యాయం అనే సినిమాను ఏ కౌసా న్యాయ్ హై అనే పేరుతో ష‌బానా అజ్మీ, సారిక త‌దిత‌రులతో హిందీలో ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారు సినిమా చేశారు. 
 
ఆ సినిమాకు నేను ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారితో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారికి సినిమాలంటే అమిత‌మైన ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. అలాంటి ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తులే ఇండ‌స్ట్రీలో నిలిచిపోయారు. మా అంద‌రికీ ఆద‌ర్శ‌వంత‌మైన ద‌ర్శ‌కుడు. గొప్ప ఎంట‌ర్‌ప్రెన్యూన‌ర్‌. సినిమా భ‌విష్య‌త్ పెర‌గ‌డానికి ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ కావాలో వాటిని అందించిన వ్య‌క్తి. గ్రేట్ కంట్రిబ్యూష‌న్ చేశారు. ఇలాంటి రోజున ఆయ‌న్ను స్మ‌రించుకునే అవ‌కాశం క‌లిగించిన ర‌మేష్ ప్రాద్‌గారికి థాంక్స్‌' అని అన్నారు. 
 
నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ.. నేను ఫిలిం ఇండ‌స్ట్రీలోకి రావడానికి కార‌ణ‌మైన వ్య‌క్తుల్లో ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారు ఒక‌రు. ఆయ‌న్ను క‌లిసిన ప్ర‌తిసారి ఏదో ఒక కొత్త విష‌యాన్ని నేర్చుకునేవాడిని. ఇప్పుడు బ‌యోపిక్ చిత్రాలు మంచి ఆద‌ర‌ణ పొందుతున్నాయి. ధోని అన్ టోల్డ్ స్టోరీ త‌ర‌హాలో ఎల్‌.వి.ప్ర‌సాద్ అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ర‌మేష్ ప్ర‌సాద్‌గారిని కోరుకుంటున్నాను. కె.య‌స్‌.ప్ర‌కాష్ రావుగారి ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. ఈ వేడుక‌కి దాస‌రినారాయ‌ణ‌రావు, విశ్వ‌నాథ్, జ‌మున‌, కృష్ణ‌వేణి వంటి గొప్ప‌వారు రావ‌డం ఆనందంగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి