'స'కారాన్ని వదిలేసి 'అ'కారాన్ని తీసుకున్నా.. అందుకే ఆపద్బాంధవుడు ఆడలేదు : కె.విశ్వనాథ్

మంగళవారం, 2 మే 2017 (16:13 IST)
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తన చిత్రాల్లో 'స'కారపు సెంటిమెంట్‌పై స్పందించారు. 'స'కారాన్ని వదిలేసి 'అ'కారాన్ని తీసుకున్నా.. అందుకే ఆపద్బాంధవుడు ఆడలేదని పలువురు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ఏ మనిషికైనా ఏదో ఒకచోట గుడ్డి నమ్మకం ఉంటుందన్న మాట వాస్తవమేనన్నారు. అందునా సినిమా వాళ్లు చాలా అధైర్యస్తులని, తమపై తాము నమ్మేదానికన్నా, ఏదో శక్తి ఉందని, అదే విజయాన్ని, పరాజయాన్ని ఇస్తాయని నమ్మతారని అన్నారు. 
 
ముఖ్యంగా కర్మకాలి ఏదేని ఒక అక్షరంతో నాలుగైదు పేర్లు కుదిరి అవి సక్సెస్ అయితే, అమ్మో అందులో ఏదో ఉందనే పరిస్థితి తప్పకుండా ఉంటుందన్నారు. అదే వీక్నెస్ అవుతుందన్నారు. అలాంటిదే తన 'స' కారమన్నారు. 'స'కారంతో తాను తీసిన సినిమాలన్నీ విజయవంతం కావడం, అది లేకుండా ఏదైనా ఓ సినిమా అనుకున్నప్పుడు కూడా కొందరు ఆ విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. 'స'కారాన్ని వదిలేసి 'అ'కారాన్ని తీసుకుని 'ఆపద్బాంధవుడు' అన్నారని అందువల్లే ఆ చిత్రం అనుకున్నంత మేరకు ఆడలేదని ఎత్తి చూపారని గుర్తు చేసుకున్నారు.
 
ఇదిలావుండగా, కె.విశ్వనాథ్‌కు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించిన అనంతరం... వేదికపై ఆయన ప్రసంగించనున్నారు. 1969లో ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు ఏ అవార్డు గ్రహీతకు వేదికపై ప్రసంగించే గౌరవం దక్కలేదు. 
 
కానీ, తొలిసారిగా ఓ అవార్డు గ్రహీత వేదికపై మాట్లాడటం కేవలం విశ్వనాథ్‌తోనే ప్రారంభకాబోతోంది. మొట్టమొదటి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందిన దేవికా రాణి మొదలుకొని ఇంతవరకు ఏ ఒక్కరికీ కూడా వేదికపై ప్రసంగించే అవకాశం దక్కలేదు. విశ్వనాథ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టుబోతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి చొరవతో ఇది సాధ్యమైంది. తన ప్రసంగంలో.... ఐదు దశాబ్దాలనాటి సినీ ప్రస్థానం, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషిపై ఆయన ప్రసంగించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి