దంచవేమేనత్త కూతురా.. పాటని యాడ్ చేసాం - పెద్దలు పిల్లలకు సినిమా చూపిస్తున్నారు: బాలకృష్ణ
బుధవారం, 25 అక్టోబరు 2023 (09:11 IST)
balakirishan,sreleela,anil and others
భగవంత్ కేసరి చిత్రాన్ని భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలలో చేర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, స్త్రీ శక్తి ప్రతిరూపం దుర్గమ్మ. అమ్మవారిని 108 నామాలతో స్మరిస్తాం. నా 108వ చిత్రం భగవంత్ కేసరి ఈ నవరాత్రుల్లో విడుదల కావడం, ఈ చిత్రానికి మూలం స్త్రీశక్తి కావడం, అమ్మవారి వాహనం పులి కావడం, ఈ చిత్రం కూడా బనావో బేటికో షేర్ అనే అంశంతో చేయడం చాలా సంతోషంగా వుంది. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రంలో మేమంతా పాలుపంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చలనచిత్రపరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రం భగవంత్ కేసరి'. ఇలాంటి అద్భుతమైన సినిమా తెలుగువారు తీశారని దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాను. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.
నాన్నగారి స్ఫూర్తితో ఏదైనా వైవిధ్యంగా చేయాలనే తపనతో చిత్ర పరిశ్రమలో నా ప్రస్థానం కొనసాగుతోంది. భైరవద్వీపం, ఆదిత్య 369, గౌతమీపుత్రశాతకర్ణి.. ఎలాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసే అవాకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడి నా అభిమాని. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపుతున్నారు. ఎంత ఎదిగిన ఒదిగివుండే తన స్వభావం, అంకితభావం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. ప్రతి మహిళ కూడా తనని తాను తర్ఫీదు చేసుకొని ఒక సైనికుడిలా తయారవ్వాలి.
ఈ సినిమాతో ఇలాంటి మంచి సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. కుటుంబాలు తమ పిల్లలని తీసుకెళ్ళి థియేటర్ లో సినిమా చూపిస్తున్నారు. ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీసిన దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందిస్తున్నాను. శ్రీలీలకు తనలో నటన ప్రతిభని చూపించే పాత్ర దక్కింది. ఈ పాత్రకు తను పూర్తి న్యాయం చేశారు. కాజల్ తన అనుభవం అంతా రంగరించి తన పాత్రని చక్కగా చేశారు. అర్జున్ రాంపాల్ గారు జాతీయ అవార్డ్ పొందిన నటుడు. ఈ చిత్రంలో తన పాత్రని అద్భుతంగా పోషించారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తమన్ నా చిత్రాలకు హైఎనర్జీ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రం పాటలు నేపధ్య సంగీతం చాలా అద్భుతంగా చేశారు. రామ్ ప్రసాద్ నా ప్రతికదలిక తెలిసిన కెమరామెన్. దర్శకుడు మనసులో వున్న కాన్సప్ట్ ని అద్భుతంగా ఒడిసిపట్టుకుంటాడు. జయచిత్ర గారు చాలా అద్భుతమైన పాత్ర చేశారు.
ఏదైనా విస్పోటనం జరిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. భగవంత్ కేసరి కూడా అలాంటి ఒక విస్పోటనంతో పుట్టింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు సాహు, హరీష్ పరిశ్రమకు దొరికిన మంచి నిర్మాతలు. మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలనే ప్యాషన్ వున్న నిర్మాతలు. కేవలం డబ్బు కోసమే కాదు.. మంచి సినిమాలు తీయాలి, సంస్థ నిలబడాలనే గొప్ప ఉద్దేశంతో పని చేస్తున్న సాహు, హరీష్ కు పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి, అజ్జు .. ఇలా అందరూ చక్కగా కుదిరారు. వెంకట్ మాస్టర్ అద్భుతమైన పోరాటాలు డిజైన్ చేశారు. పోరాట సన్నివేశాలకు ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, వీఎఫ్ ఎక్స్ నరేంద్ర మంచి పని తీరు కనబరిచారు. మా నటులు జానకి, శకుంతుల, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, రచ్చరవి, జీవన్ , శ్రవణ్, భరత్ రెడ్డి ఆనంద్ ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం సమిష్టి కృషి. ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం కోసం దంచవేమేనత్త కూతురా పాటని చాలా గ్రాండ్ గా తీశాం. ఇప్పుడా పాటని అభిమానులు, ప్రేక్షకులు కోరిక మేరకు యాడ్ చేస్తున్నాం. మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమీకి డబుల్ ధమాకా... అటు పండగ.. ఇటు భగవంత్ కేసరి ఘన విజయం. భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలు చాలా అరుదుగా వుంటాయి. వాటిలో ఒకటిగా భగవంత్ కేసరి ని చేర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.