తాలిబన్ పాలిత దేశమైన ఆప్ఘనిస్థాన్ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఏకంగా 600 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ప్రకృతి విపత్తు సంభవించింది. ఈ భూకంపంలో మరో వెయ్యి మంది వరకు గాయపడినట్టు సమాచారం. కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనడోలు వార్తా సంస్థకు వెల్లడించింది.
స్థానిక కాలమానం ప్రకారం గత రాత్రి 11:47 గంటలకు భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్ఓఎస్) తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్ జెడ్) పేర్కొంది. భూకంప కేంద్రం బసావుల్ పట్టణానికి 36 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నట్టు గుర్తించారు. లోతు తక్కువగా ఉండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.
కునార్ ప్రావిన్స్‌లోని నూర్ గల్, సావ్కి, వాత్పుర్, మనోగీ, చపా దారా జిల్లాల్లో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి సుమారు 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు కనిపించింది. ఇక్కడ కూడా కొన్ని సెకన్ల పాటు భవనాలు కంపించాయని ఏఎఫ్పీ జర్నలిస్టులు పేర్కొన్నారు.
అక్టోబరు 7వ తేదీన 2023న కూడా ఆఫ్ఘనిస్థానులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ విపత్తులో కనీసం 4,000 మంది చనిపోయారని తాలిబన్ ప్రభుత్వం అంచనా వేయగా, ఐక్యరాజ్యసమితి మాత్రం మృతుల సంఖ్య సుమారు 1,500 అని పేర్కొంది. ఇటీవలికాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా అది నిలిచింది.