'శాతకర్ణి'కి ఇచ్చారు.. 'రుద్రమదేవి'కి ఇవ్వలేదు... బాబుగారూ మీరు చూస్తే అవుతుంది... గుణశేఖర్

మంగళవారం, 10 జనవరి 2017 (18:10 IST)
దర్శక నిర్మాత గుణశేఖర్ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీలో వినోదపు పన్ను రాయితీని ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ రుద్రమదేవి సినిమా సమయంలో ఏపీ సర్కారు చొరవ చూపలేదంటూ విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా ఏపీ సర్కారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికైనా 'రుద్రమదేవి'కి వినోదపన్నురద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో రుద్రమదేవి సినిమా వినోదపు పన్ను వసూళ్ళకు సమానంగా 'ప్రోత్సాహక నగదు' ఇవ్వాలని గుణశేఖర్ డిమాండ్ చేశారు.
 
ఇంకా గుణశేఖర్ బాబు రాసిన లేఖలో ఏం చెప్పారంటే..?
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రియ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు గుణశేఖర్ గౌరవవందనాలు.. 
 
ముందుగా చారిత్రాత్మక చలనచిత్రంగా రూపొందించబడిన గౌతమీపుత్రశాతకర్ణికి వినోదపు పన్నురాయితీ ప్రకటించి, కళలపట్ల, సంస్కృతిపట్ల మీరు చూపే ఆదరాభిమానాలకు సాటి తెలుగుచలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 
 
2015 అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో నా దర్శకత్వ నిర్మాణ  బాధ్యతలతో గుణా టీమ్ అండ్ వర్క్స్ పతాకంపై విడుదలైన రుద్రమదేవి చిత్రం కూడా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగులో నిర్మింపబడిన చారిత్రాత్మక చిత్రంగా గతంలోనే వినోదపు పన్ను రాయితీ కోరుతూ దరఖాస్తు పూర్వకంగా మీ సర్కారు దృష్టికి తేవడం జరిగింది. ముందుగా సానుకూలంగా స్పందించిన ప్రభుత్వాధికారులు కొంత పురోగతిని చూపి అర్థాంతరంగా ఫైలు మూసేయడం జరిగిందంటూ తెలియజేశారు. దరఖాస్తుదారుని విన్నపం మేరకు కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసి అక్కడికే నిలిపేశారు. ఈ వ్యవహారంపై మిమ్మల్ని కలవాలనుకుని ప్రయత్నించినా కలుసుకోలేకపోయాను. 
 
ఈ పురుషాధిక్య సమాజంలో 13వ దశాబ్దంలోనే స్త్రీ సాధికారతను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన కాకతీయ మహాసామ్రాజ్ఞి రాణిరుద్రమదేవి చరిత్రను ఇప్పటిరీ కొనసాగుతున్న ఈ పురుషాధిక్య సమాజంలో (భారతీయ చిత్రపరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని భావిస్తున్నాను) ఆదర్శవంతమైన స్త్రీమూరి జీవిత గాధగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించి, ఓ సగటు కళాకారుడిగా ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించి ఆమె చరిత్రకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడం కళామతల్లికి నా వంతు సేవగా భావించాను. 
 
ఈ మహత్కార్యంలో ఎందరో చిత్రప్రముఖులు నాకు అండగా నిలిచారు. చిత్ర విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు, నేను దరఖాస్తు చేసుకున్న గౌరవనీయులు తెలంగాణ ప్రభుత్వ ప్రియ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు గారు కూడా తక్షణమే స్పందించి తెలంగాణ రాష్ట్రానికిగానూ వినోదపు పన్ను రాయితీని కల్పించారు. నేను ఆశించినట్లుగా ఏపీ సర్కారు కూడా రుద్రమ దేవికి వినోదపు పన్ను రాయితీ ప్రకటించి వుంటే నిర్మాతగా నాకు కొంత ఉపశమనం కలిగివుండేది. రాణీరుద్రమదేవి కేవలం తెలంగాణకే పరిమితమైన నాయకురాలు కాదని.. దాదాపు దక్షిణాపథమంతటినీ పాలించిన మహారాణి అని.. ఆమె పట్టాభిషేక సందర్భంగా ఏపీ అమరావతిలోని మంగళగిరి వద్ద గల మార్కాపురం శాసనం కూడా ఇటీవల మీరు కూడా ఒకానొక సభలో ఉదహరించడం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో నా దరఖాస్తుని పునఃపరిశీలించి ఇప్పటికే రుద్రమదేవి చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ప్రోత్సాహక నగదును అందజేసి ఏపీ ప్రభుత్వం నిష్ప క్షపాతంగా పారదర్శకంగా పనిచేస్తుందని ఇదివరకే ఎన్నో సందర్భాల్లో రుజువు చేసినట్లుగానే మరోమారు మీరు మీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నానని గుణశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి