చరణ్‌ను మోసం చేసి 'రంగస్థలం' తీశా.. సారీ చెప్పిన దర్శకుడు
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (16:52 IST)
తాను హీరో రామ్ చరణ్‌ను మోసం చేసి "రంగస్థలం" చిత్రాన్ని తీసినట్టు, ఈ విషయం తనొక్కడికి తప్ప మిగిలిన వారికి చివరకు హీరోకు కూడా తెలియదని ఆ చిత్ర దర్శకుడు కె.సుకుమార్ వెల్లడించారు. సోమవారం మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్ల గ్రాస్ సాధించినందుకుగాను చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఇందులో సుకుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని చిట్టిబాబు పాత్రలో చరణ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేనని చెప్పారు. పెద్ద స్టార్ కుమారుడై ఉండి కూడా చెవిటి మెషీన్ పెట్టుకున్నాడని ప్రశంసించాడు. ఒక స్టార్ హీరో చెవిటి మెషీన్ పెట్టుకుంటే బాగుంటుందా అనే డౌట్ తనలో ఉండేదని... నమ్మకం లేకుండానే చరణ్‌కు చెవిటి మెషీన్ ఇచ్చానని తెలిపాడు. చరణ్ తనను నమ్మాడని... మెషీన్ పెట్టుకోవడం వల్లే ఆ పాత్రను కొనసాగించగలిగానని చెప్పాడు. ఈ రకంగా చరణ్‌ను మోసం చేశానని, సారీ చెర్రీ అంటూ సీక్రెట్‌ను బహిర్గతం చేశాడు. పైగా, 'రంగస్థలం' సినిమా ఇంత విజయం సాధించడానికి రామ్ చరణే కారణమని సుక్కు వెల్లడించారు.
ఇకపోతే, ఈ చిత్రంలో విలన్ పాత్రధారి జగపతి బాబు గురించి మాట్లాడుతూ, 'నాన్నకు ప్రేమతో' చేసినప్పుడు ఓ బిజినెస్‌మేన్‌గా జగపతిబాబు లుక్ చూసిన వాళ్లంతా ఆయన చాలా సెక్సీగా ఉన్నారని అన్నారు. ఇక 'రంగస్థలం'లో పక్కా పల్లెటూరి వ్యక్తిగా పంచె కట్టి ఆయన చుట్ట కాలుస్తారు. ఈ సారి కూడా కాల్స్ వచ్చాయి. జగపతిబాబుగారు చాలా సెక్సీగా వున్నారని. ఆయన ఏ గెటప్‌లో ఉన్నా గ్లామర్ పోకపోవడం విశేషం. బంగారాన్ని ఏ రూపంలోకి మార్చినా బంగారమే.. అలా జగపతిబాబుగారు కూడా బంగారంలాంటి ఆర్టిస్ట్ అని నా నమ్మకం' అని వ్యాఖ్యానించారు.
అలాగే, రంగమ్మత్త అనసూయ గురించి మాట్లాడుతూ, రంగమ్మత్తగా నటించిన అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. అనసూయతో ఆ పాత్రకే అందం వచ్చిందన్నారు. తమిళ, తెలుగు పరిశ్రమలోని ఒక పదిమందిని తీసుకొచ్చి వారికి ఆడిషన్స్ కూడా నిర్వహించామని... అయినా ఆ క్యారెక్టర్‌కు ఎవరూ సూట్ కాలేదని వెల్లడించారు. రంగమ్మత్త క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నానని... అనసూయ చాలా గొప్పగా నటించిందని కితాబిచ్చాడు.
ఇక హీరోయిన్ సమంత గురించి మాట్లాడుతూ, ఈ చిత్రానికి హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ భయపడ్డారన్నారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత సమంత ఎలా మారిపోతుందోనని చాలా మంది తనతో అన్నారన్నారు. కానీ, పెళ్లికి ముందు ఎలా ఉన్నదో.. పెళ్లి తర్వాత కూడా అలానే శ్యామ్ ఉన్నదని చెప్పాడు. అందువల్ల పెళ్లి అయిన తర్వాత కూడా హీరోయిన్లతో సినిమాలు తీయొచ్చని శ్యామ్‌తో తేలిపోయిందని, అందువల్ల పెళ్లయిన వారిని కూడా హీరోయిన్లుగా ఎంపిక చేసుకోవచ్చని ఇతర డైరెక్టర్లకు సుక్కు సలహా ఇచ్చారు.