పాతాళ భైరవిలో అక్కినేనిని ఎందుకు తీసుకోలేదో తెలుసా!
సోమవారం, 15 మార్చి 2021 (20:18 IST)
Patala Bhairavi
పాతాళభైరవి ఈ సినిమా ఎన్.టి.ఆర్.కు గొప్ప పునాది వేసింది. నేపాళ మాంత్రీకుడిగా ఎస్.వి. రంగారావుకు ఎనలేని గుర్తింపు తెచ్చింది. కె.వి. రెడ్డి దర్శకత్వంలో మాధవపెడ్డి గోఖలే కళా దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం నేటికి 70 ఏళ్ళు పూర్తిచేసుకుంది. 15 మార్చి 1951లో ఈ సినిమా విడుదలైంది.
అయితే హీరో తోటరాముడు పాత్ర అక్కినేనిని వరించింఇ. కానీ పరిస్థితులు తర్వాత తారు మారయ్యాయి. దర్శకుడి కోణం ఓ సంఘటనతో మారింది. అదెలాగంటే, అప్పట్లో రాసిన రాతలనుబట్టి తోట రాముడు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును, మాంత్రికుడు పాత్రకు ముక్కామలను దర్శకుడు కె.వి.రెడ్డి తీసుకుందామని అనుకున్నాడు. అలాగే అని నాగిరెడ్డి-చక్రపాణిల సూచనను మన్నించి కె.వి.రెడ్డిగారు ఓసారి ఎన్.టి.రామారావు టెన్నిస్ ఆడేటప్పుడు పూర్తిగా పరిశీలించారు. ఆ రోజుల్లో సాయంత్రం వేళలో షూటింగ్ పాకప్ చెప్పాక అక్కినేని, రామారావు, బాలకృష్ణ వాహినీ స్టూడియో దగ్గర టెన్నిస్ ఆడేవారు. ఆ మేచ్ చూడడానికి వచ్చిన కె.వి.రెడ్డి, రామారావు ఆడుతూ రెండు పాయింట్లు కోల్పోవడంతో కోపగించి బ్యాటును బలంగా పట్టుకుని బంతి విసిరికొట్టడంతో ఓ విధమైన జానపద నాయక లక్షణం అతనిలో కనిపించింది. కె.వి.రెడ్డిగారు మరోసారి ఆలోచించకుండా రామారావునే హీరోగా తీసుకున్నాడు. పైగా హీరోగా పెద్ద ఇమేజీ లేని నటుడిని తీసుకోవడంతో ప్రతినాయకుడు కూడా ప్రఖ్యాతుడైన ముక్కామలను మొదట అనుకున్నారు. రామారావు కొత్తవాడు కనుక మాంత్రీకుడుకూడా కొత్తవాడు బాగుంటాడని ఎస్.వి. రంగారావును తీసుకున్నారు. అలా ఆ సినిమా వెండితెరకు ఎక్కింది.
1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రమూ పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్ లో తీశారు.
- పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది.
- మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలులోని ఒక కథ, అల్లాఉద్దీన్ అద్భుత దీప కథ, బాల నాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు.
కథగా చెప్పాలంటే, ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు (ఎన్.టి.ఆర్). సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె మాలతి అప్పుడప్పుడూ ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసుపడుతుంది. ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాళ మాంత్రికుని ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళభైరవి (గిరిజ) అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తికి ఎదురు ఉండదని, మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకొన్న తోటరాముడు అదునుచూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు.
మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకొంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరది (రేలంగి) పాతాళభైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయవలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మాంత్రికుడు వంచనతో పెళ్ళి పీటలపైనున్న రాకుమారిని మాయం చేస్తాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు.