హీరో విశాల్, ఆర్య కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఎనిమి. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో విశాల్ చెప్పిన విశేషాలు.
- దర్శకుడు ఆనంద్ శంకర్ నాకు పరిచయమే లేదు. ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి కథ చెపుతానన్నారు. అప్పుడు ఆయన చేసిన నోటా, ఇరుముగళ్ సినిమాలు చూశాను. తర్వాత జస్ట్ కథ విన్నాను. నేను హీరోగా కథ వినలేదు. కేవలం ఒక ప్రేక్షకుడిగా కథ విన్నా. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
- సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా అక్కడకు వెళ్లలేము. పోనీ మలేషియాలో చేద్దామనుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. కరోనా ఫస్ట్ వేవ్‌లో 6 నెలల ఇంట్లోనే కూర్చున్నాం. ఆ తర్వాత ఇక దుబాయ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కరోనా ప్యాండమిక్‌లో షూటింగ్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా మాదే అనుకుంటా. దుబాయ్‌కు వెళ్లి అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశాం. తర్వాత హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమాల షూటింగ్స్ కూడా లేవు. ఏవో ఒకట్రెండు సీరియళ్ల షూటింగ్ మాత్రమే జరుగుతోంది. ఇక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించి త్వరగా షూటింగ్ పూర్తి చేశాం
- ఈ సినిమా నిర్మాత వినోద్‌కు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏ నిర్మాత కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేరు. సినిమా కోసం 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఆయనకు ఓటీటీ నుంచి టేబుల్ ప్రాఫిట్ ఆఫర్ వచ్చింది. అయినా కూడా డబ్బుకు ఆశపడలేదు. ఈ విజువల్ ట్రీట్ సినిమాను థియేటర్లో చూస్తేనే బాగుంటుందని డిసైడ్ అయ్యారు. రెండు నెలలు వెయిట్ చేశారు. కరెక్ట్‌గా ఇప్పుడు దీపావళి కలిసొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాజిక్ నా కెరీర్లో కొన్ని సార్లే జరిగింది. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుంది. ప్రేక్షకులు ఇంటర్నేషనల్ మూవీలా ఫీలవుతారు.