ఇటీవలికాలంలో దక్షిణాది చిత్రపరిశ్రమలో వరుస విషాదకర ఘటనలు సంభవిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సీనియర్, యువ, వర్థమాన నటీనటులు హఠాన్మరణం చెందుతున్నారు. తాజాగా మాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ డైరెక్టర్ కొచ్చిన్‌లో ప్రాణాలు విడిచాడు. ఆ డైరెక్టర్ పేరు జోసెఫ్ మను జేమ్స్. వయస్సు 31 సంవత్సరాలు.
 
									
				
	 
	ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో నందమూరి తారకరత్న గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటనను మరిచిపోకముందే ఇపుడు యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా జాండిస్‌తో బాధపడుతూ వచ్చిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, జాండీస్ ముదిరిపోవడంతో ఆయన ఆరోగ్యం విషమించి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కేరళ చిత్రపరిశ్రమలో విషాదచాయలు అలముకున్నాయి. 
 
									
				
	 
	మను జేమ్స్ డైరెక్ట్ చేసిన తొలిచిత్రం "నాన్సీరాణి" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదలకాకముందే ఆయన చనిపోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. అలాగే, ఈయన గత 2004లో వచ్చిన "అయామ్ క్యూరియస్" అనే సినిమాలో కూడా ఓ చిన్న పాత్రను పోషించారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసి, ఇపుడు ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ, ఆ చిత్రం విడుదలకు ముందే ఆయన చనిపోవడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు.