నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయాశరణ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఈనెల ఆరో తేదీ నుంచి రాజసూయయాగం చిత్రీకరణను ప్రారంభించారు. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకుని తన పేరుని గౌతమీపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు.
ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్రకటించారు. అప్పటి నుండి అదే రోజున ఉగాది పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. యాధృచ్చికంగా బాలకృష్ణ కూడా తన తల్లి పేరుతో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు గర్వపడేలా చేస్తున్నారు. అలాగే రాజసూయం షూటింగ్ ప్రారంభమైన సెప్టెంబర్ 6న బాలకృష్ణ తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం కావడం, అలాగే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన రోజునే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో రాజసూయ యాగం చిత్రీకరణ ప్రారభమవడం దైవ సంకల్పమే కాక స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు అని చెప్పవచ్చు.
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన గురించి నందమూరి బాలకృష్ణ సినిమా తీస్తున్నాడనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. అందరి అంచనాలను అందుకునేలా సినిమాను దర్శకుడు జాగర్లమూడి క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. ఆగస్టు 29న మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.