ఆస్కార్ రేస్ : "ఆర్ఆర్ఆర్‌"కు తీవ్ర నిరాశ - గుజరాతీ మూవీకి ఛాన్స్

మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (20:26 IST)
ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డులు 2023కు చిత్రాల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఇందులోభాగంగా, ఇంటర్నేషనల్ రీజనల్ లాంగ్వేజ్ విభాగంలో భారత్ నుంచి గుజరాతీ చిత్రం ఎంపికైంది. ఆ చిత్రం పేరు "ఛెల్లో షో"
 
ఈ ఆస్కార్ రేసులో "ఆర్ఆర్ఆర్", "కాశ్మీర్ ఫైల్స్" చిత్రాలు నామినేట్ అవుతాయని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, గుజరాతీ మూవీ దూసుకెళ్లింది. ఈ చిత్రం ఆస్కార్‌లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పోటీపడనుంది. 
 
గుజరాతీ దర్శకుడు పన్ నళిన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛెల్లో షో' చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'లాస్ట్ ఫిల్మ్ షో' పేరిట ఇంగ్లీషు సబ్ టైటిల్స్‌తో ప్రదర్శితమైంది. 
 
తమ చిత్రం ఆస్కార్‌కు వెళుతుండడం పట్ల దర్శకుడు పన్ "ఓ మై గాడ్" అంటూ సంతోషం వ్యక్తం చేశారు. పన్ నళిన్ ఇదివరకు సంసార, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
కాగా, భారత్ నుంచి ఆస్కార్‌కు వెళ్లే చిత్రం ఎంపికపై జ్యూరీలో పెద్ద చర్చే నడిచింది. కొన్ని మలయాళ చిత్రాలు, తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు కూడా చర్చకు వచ్చాయి. 
 
ముఖ్యంగా, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు వెళ్లడం ఖాయమని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి అంచనాల్లేని ఛెల్లో షో చిత్రం ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు