హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

ఠాగూర్

సోమవారం, 11 ఆగస్టు 2025 (19:07 IST)
హైటెక్ భారతంలో అవసరానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకుండాపోయింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన భార్య మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకురాలేదు. దీంతో కట్టుకున్న భర్త పుట్టెండు దుఃఖంలో తన భార్య మృతదేహాన్ని బైకుకు కట్టుకుని స్వగ్రామానికి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అమిత్ అనే వ్యక్తి అతడి భార్యతో కలిసి ఆదివారం లోనారా ప్రాంతం నుంచి నాగ్‌పూర్ - జబల్‌పూర్ జాతీయ రహదారి మీదుగా కరణ్‌పూర్‌కు వెళుతుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమిత్ భార్య తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె చివరకు అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
దీంతో పుట్టెడు దుఃఖంలో అమిత్.. తన భార్య మృతదేహాన్ని బైకుకు కట్టుకుని అదే జాతీయ రహదారి మీదుగా తమ గ్రామానికి తీసుకెళ్లాడు. అయితే, కొందరు స్థానికులు మాత్రం అమిత్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అమిత్‌ను అడ్డుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు