గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి : వెంకయ్య నాయుడు

శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:40 IST)
Venkaiah Naidu, Sanjay Kishore, budhaprasad
సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన ‘స్వాతంత్రోద్యమం– తెలుగు సినిమా– ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో అతిరధ మహారధుల సమక్షంలో శనివారం ఉదయం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని విడుదల చేసి మాట్లాడుతూ–‘‘ తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉన్నది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించిన చక్కటి విశ్లేషణ చేశాడు.

Venkaiah Naidu, Sanjay Kishore, budhaprasad and ohters
ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఒకప్పుడు ఒక సభ నిర్వహిస్తున్నామంటే ఎక్కడెక్కడి నుండో ప్రజలు పాల్గొనేవారు. ఇప్పుడు ఏ సభ అయినా నిర్వహిస్తే మూడు బీలు సమకూర్చాలి అంటున్నారు. మూడు బీ-లంటే బస్సు– బిరియాని–బాటిల్‌ ఈ మూడు ఉంటేనే సమావేశాలకు హాజరవుతున్నారు. ఇవన్నీ వింటుంటే మనదేశం ఎక్కడికిపోతుంది అని భాదేస్తుంది. గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి అంటూ గురువు గొప్పతనాన్ని గురించి ముచ్చటించారు. ఇటువంటి మంచి పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావటానికి సంజయ్‌ కిశోర్‌ని ప్రయత్నించమని కోరుతున్నా’’ అన్నారు.
 
పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ మాట్లాడుతూ–‘‘ ఒక సందర్భంలో కె.వి రమణాచారి గారిని కలిసినప్పుడు స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ అనే కార్యక్రమం చేస్తుంది. నువ్వు కూడా ఏదన్నా చెయ్యి సంజయ్‌ అని నాలుగు మంచి మాటలు చెప్పారు. నాకు సినిమాపై నాలెడ్జ్‌ ఉండటంతో ఆరునెలల్లో స్వాతంత్య్రంలో పాల్గొన్న మన సినిమా పెద్దల గురించి రాద్దామని అనుకుని ఈ పుస్తక ప్రయాణం మొదలు పెట్టాను. దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం పట్టింది పుస్తకాన్ని తీసుకురావటానికి. నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను నమ్మి ఆర్ధిక సాయం చేసే కిమ్స్‌ అధినేత బొల్లినేని కృష్ణయ్యగారు, సదరన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ అధినేత రాజశేఖర్‌గారు సాయం చేశారు. ఇంతమంచి పుస్తకాన్ని ఆవిష్కరించటానికి సరైన వ్యక్తి వెంకయ్యనాయుడుగారి చేతులమీదుగా విడుదలవ్వటం నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.
 
సభాధ్యక్షుడు కె.వి.రమణాచారి మాట్లాడుతూ– మంచి చేయమని ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్తాము. అది విని ఆచరించే సంజయ్‌ కిశోర్‌ లాంటి వాళ్లు ఎంతమంది ఉంటారు. అనేక మంచి విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతమంది గొప్పవారి గురించి చక్కగా రాశారు సంజయ్‌ కిశోర్‌’’ అన్నారు.
 
దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ–‘‘ బుక్‌లోని కొన్ని విషయాలు చదువుతుంటే రోమాంచితుడిని అయ్యాను. ఈ పుస్తకంలో బి.విఠలాచార్య గురించి, అల్లు రామలింగయ్య గురించి రాసిన విషయాలు తెలుసుకుని ఆశ్యర్యపోయాను’’అన్నారు.
 
మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ–‘‘ ఈ రోజు సమాజానికి ఇటువంటి పుస్తకాలు ఎంతో అవసరం. తెలుగు సినిమాలో ఎంతమంది గొప్పవారు ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రజా ప్రతినిధులే ఎటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారో మనందరం గమనిస్తేనే ఉన్నాం, సమాజంలో మార్పు రావాలి’’ అన్నారు. ‘‘సంజయ్‌ కిశోర్‌ ఏ పని తలపెట్టినా మా వంతుగా మేము సాయం చేస్తాము. అతను మా కుటుంబసభ్యుడే అన్నారు’’ కిమ్స్‌ అధినేత బొల్లినేని కృష్ణయ్య ఎస్‌.ఈ.డబ్యూ అధినేత రాజశేఖర్‌. పుస్తక తొలిప్రతిని శ్రీకర ఆర్గానిక్స్‌ రాజు లక్షా వెయ్యి నూటవరహారు రూపాయాలకు కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ గాయణిమణులు, సినిమా పెద్దలతో పాటు జొన్నలగడ్డ రామకృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు