బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషించారు. అయితే, ఈ చిత్రంలో రాముడు ఎరుపు రంగులో ఉన్నారు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా హీరో సుమన్ కూడా స్పందించారు. తనకు తెలిసినంతవరకు స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి శ్రీరాముడు నీలం రంగులోనే కనిపిస్తూ వచ్చారని, కానీ, ఈ చిత్రంలో మాత్రం సాదాగా చూపించారని అన్నారు.
రాముడిగా ప్రభాస్ చాలా బాగున్నాడు.. కానీ మీసాలు పెట్టారు. ఇంతవరకూ ఎక్కడా అలా చేయలేదు. శ్రీరాముడు మహా శాంతమూర్తి .. అలాంటి ఆయనతో ఫోర్స్‌గా ఉండే డైలాగ్స్ చెప్పించారు. ఇక రావణుడికి మోడ్రన్ హెయిర్ స్టైల్ పెట్టారు. ఆయన పాత్రపై హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. సాంగ్స్ .. రీ రికార్డింగ్ నాకు బాగా నచ్చాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కుదరలేదు అని అన్నారు.
కాగా భారీ బడ్జెట్‌తో తరెక్కించిన ఈ చిత్రంలో 'రామాయణం' కథను మొత్తం చూపిస్తారనుకుని వచ్చిన ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యారు. ఎందుకంటే సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లడం .. శ్రీరాముడు ఆమెను తిరిగి తీసుకురావడం వరకే ఈ సినిమాలో చూపించారు. పైగా, ఇవన్నీ కూడా బొమ్మలాటల్లా గ్రాఫిక్స్ చేసి చూపించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అయితే ఏకంగా ఈ చిత్రాన్ని నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఏకంగా లేఖ కూడా రాసింది.