బాహుబలి అఖండ విజయం తర్వాత దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం ఏంటనేది అభిమానులకి ఓ క్లారిటీ వచ్చింది. డీవీవీ దానయ్య నిర్మాణంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ముగ్గురు టైటాన్స్ అపూర్వ కలయికకు ప్రతిబింబం అంటూ టీజర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రం ఎనౌన్స్ అయినప్పటి దగ్గరి నుండి ఇందులో పలు పాత్రలకి సంబంధించి రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.
విలన్ పాత్రకి యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్‌ని తీసుకున్నారని ఆమధ్య పుకార్లు షికారు చేయగా, దీనిని జీవిత ఖండించారు. ఆ తర్వాత నాని ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు నాని. కృష్ణార్జున యుద్ధం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి నాని బదులిస్తూ.. ఎన్టీయార్-చరణ్ సినిమాలో నేను నటించడం లేదు. అది పూర్తిగా చరణ్-ఎన్టీయార్ సినిమానే.
అలాగే త్రివిక్రమ్, సుకుమార్ సినిమాల్లో కూడా నటిస్తున్నానని రాస్తున్నారు. అవేవి నిజం కాదు. కలిసి పనిచేయాలని మాకు ఉంది. కలిసినపుడు మాట్లాడుకుంటాం. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని అన్నాడు. నాని తాజా చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుండగా ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు.