నా స్టామినీ నిరూపించుకోవాలనే మళ్ళీ నటిగా మారాను - సుమ కనకాల
గురువారం, 5 మే 2022 (16:54 IST)
Suma Kanakala
సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే6 సినిమా విడుదలకానుంది. ఇటీవలే శ్రీకాకుళం యాత్రను సుమ తన టీమ్‌తో దిగ్వియంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమ గురువారంనాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.
జయమ్మ పంచాయితీ ఎందుకు చేయాలనిపించింది?
మీరు చేయగలరా? అని దర్శకుడు అగడడంతో చాలెంజ్‌గా స్వీకరించి చేశాను. ఇది చాలా సంవత్సరాలుగా నన్ను నేను వేసుకున్న ప్రశ్నే. టీవీ యాంకర్‌గా నన్ను ఎవరూ ప్రశ్నించను. కానీ నటిగా చేయాలంటే కొన్ని పరిమితులుంటాయి. అవి ఈ కథ విన్నాక చేసేలా చేశాయి.
నటిగా గ్యాప్ తీసుకోవడానికి కారణం?
టీవీ అనేది కఫంర్ట్ జోన్‌గా వుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వృత్తిదర్మంగా టీవీ షోలు చేయడంతో ఖాళీ దొరకలేదు. అలాంటి టైంలో దర్శకుడు విజయ్‌గారు జయమ్మ పంచాయితీ కథ వినిపించారు. ఈ కథ రమ్యకృష్ణ, అనుష్క వంటివారిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు. ఆఖరికి నా దగ్గరకు రావడం, పెద్ద నిడివి వున్న పాత్ర కావడంతో గొప్పగా ఫీలయ్యాను. సుమ వుందటే వినోదాన్ని చూస్తారు. కానీ ఈ సినిమాలోని పాత్రను ఛాలెంజ్‌గా స్వీకరించి చేశాను. ఇందులో విలేజ్ డ్రామా వుంది.
మంచి పొజిషన్‌లో వున్న మీరు కొత్త దర్శకులతో అవవసరమా అని ఎప్పడైనా అనిపించిందా?
అప్పటికీ రకరకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఇది. వైజాగ్ నుంచి మూడు గంటలు పాలకొండకు జర్నీ చేయాలి. కాబట్టి ఇంటిలో మా పిల్లల అనుమతి తీసుకున్నా. ఆ తర్వాత నాకు నేను కొత్తదనం కోసం ప్రయత్నించాలని ఆలోచించాను. కొంత రిస్క్, భయం వున్నా కొత్తగా నా టాలెంట్‌ను చూపించాలని చేసిన సినిమానే ఇది.
సుమ రియల్‌లైఫ్‌లో చేయని పాత్ర ట్రైలర్‌లో కనిపిస్తుంది?
నేను థియేటర్ ఆర్టిస్టుగా అప్పట్లో కొన్ని డ్రామాలు చేశాను. అవన్నీ మిస్ అయ్యాను అనిపించింది. దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ తీసుకురావడం, డబ్బింగ్ లేకుండా సింక్ సౌండ్‌తో చేయడం, శ్రీకాకుళం యాస ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి. యాంకర్‌గా తప్పుపట్టకుండా చూసుకుంటాను. కానీ తెలీని యాసలో మాట్లాడి మెప్పించం కష్టమే. ఇందులో నేను ఫోన్ పట్టుకునే సీన్ కూడా జయమ్మలాగానే వుండాలని దర్శకుడు చెప్పడం, యాసకోసం డైరెక్షన్ డిపార్టమెంట్ సలహాలు తీసుకోవడం, తోటి ఆర్టిస్టుల ద్వారా యాసను పట్టుకోవడం వంటివన్నీ జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా ఇది. ఇప్పటివరుకు చాలా సినిమాల్లో శ్రీకాకుళం యాసను ఓవర్‌గా చూపించినట్లు వుండేది. కానీ ఇందులో సహజంగా ఎలా మాట్లాడతారో అలా చూపించారు. కొన్ని కొత్త పదాలు తెసుకోగలిగాను. చదివింపులను ఈడెలు అంటారు. సిల్లంగి అంటే చేతబడి. ఇలా ఆ పదాలను ఆ యాసలో మాట్లాడి మెప్పించే ప్రయత్నం చేశాను.
కథలో మీ పంచాయితీ ఏమిటి?
ఈడెల పంచాయతీయే కథ. ఏదైనా ఫంక్షన్లలో చదివింపులు (ఈడెలు) సహజం. అలాంటి పంచాయతీ నేను చేసేది. కాకపోతే జయమ్మకో సమస్య వుంటుంది. ఇతరులకు కొన్ని సమస్యలుంటాయి. అవన్నీ జయమ్మ సమస్యతో ముడిపడి వుంటాయి.
ఏదైనా కమర్షియల్ సినిమాలో ఓ పాత్ర చేయడం వేరు? మీరే ప్రధాన పాత్ర చేయడం ఎలా అనిపిస్తుంది?
కథంతా నా భుజాలపై వుందనిపిస్తుంది. కానీ కథలో పోనుపోను అని పాత్రలతో లీనమైపోతారు. అది దర్శకుడు చేసిన మేజిక్. నా పాత్రే కనిపిస్తుంది. సుమ కనిపించదు.
రాజీవ్ కనకాల నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నారా?
తీసుకోలేదు.
మీ జయమ్మ పాత్రకు రిఫరెన్స్ ఎవరు?
దర్శకుడు శ్రీకాకుళం వాస్తవ్యుడు కాబట్టి అక్కడ తన కుటుంబీకులతో మాట్లాడుతున్నప్పుడు, వారు చేపల మార్కెట్లో వున్నప్పుడూ.. ఇలా రకరకాల సంఘటనలను ఫోన్‌లో షూట్ చేసినాకు పంపారు. అవన్నీ నేను ఇన్‌పుట్స్‌గా తీసుకుని జయమ్మ పాత్రకు మలుచుకున్నాను.
ట్రైలర్ చూస్తే సీరియస్‌గా వుంది. ఫన్ వుంటుందా?
ఇది విలేజ్ బేస్డ్ కథ. కేరాఫ్ కంచెరఫాలెం సినిమా తరహాలో వుంటుంది. ప్రత్యేకంగా ఫన్ వుండదు. కథనంలోనే పాత్రల ద్వారా సంఘటన ద్వారా ఫన్ వస్తుంది.
సుమను చూడ్డానికి వచ్చేవారు నిరాశ చెందుతారా?
సుమ ఇలా కూడా చేయగలుగుతుందా! అనిపించుకుంటాను.
అర్బన్ లైఫ్ నుంచి విలేజ్ లైఫ్‌కు వెళ్ళడం ఎలా అనిపించింది?
నేను సెలబ్రిటీ అయ్యాక ఇన్ని రోజులు విలేజ్‌లో వుండడం జరగలేదు. షూటింగ్ గేప్‌లో అక్కడి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం నాకు చాలా ఉపయోగపడింది. పాలకొండ అనే సుందరమైన ప్రదేశాలు, దట్టమైన అడవిని ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూపించలేదు. కేరళ తరహాలో పోలిన జలపాతాలు, లోయలు, కొండలు ఇక్కడ వున్నాయి. ఈ సినిమా తర్వాత అన్నీ వెలుగులోకి వస్తాయి.
ఈ సినిమా చేయడం వ్లల్ల టీవీలో వచ్చే ఆదాయం మిస్ అయిందనిపించిందా?
ఈ సినిమాకు కేటాయించిన టైంలో ఎన్నో టీవీ షోలు చేసి సంపాదించవచ్చు. కానీ నా స్టామినాను సినిమా ద్వారా అందరికీ తెలియజేయాలంటే ఇదే సరైన నిర్ణయం. అందుకే ధైర్యంగా ముందడుగు వేశాను.
జయమ్మ పాత్ర ఎంత పేరు తెస్తుందని భావిస్తున్నారు?
బాగా రావాలని చేస్తాం. నాతోపాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, లోకల్ నటులు అందరికీ మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నాను.
ఇతర సినిమాకు ప్రీరిలీజ్‌లు, ఇంటర్వ్యూ చేసే మీరు మీ సినిమాకు ప్రమోషన్ చేయడంలో వ్యత్యాసం ఏం గమనించారు?
ప్రీరిలీజ్‌లు, ఇంటర్వ్యూలు అలా వచ్చి చేసి వెళ్ళిపోవడమే. కానీ సినిమా ప్రమోషన్‌లో చిత్ర బృందం పడే కష్టం ఏమిటో తెలుసుకున్నాను. వారి మానసిక స్థితి ఏమిటో అర్థమయింది. అందుకే మా అబ్బాయి రోషన్ నటుడు అవ్వాలనుందని చెబుతుంటే, వాడిని కూడా ఇవన్నీ చూసుకుని రా అని చెప్పాను.
మీ అబ్బాయి రోషన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు?
ఏదైనా వాడి నిర్ణయమే. మా ప్రమేయం కథలో ఏమీ వుండదు. చిన్నతనంనుంచి నటుడు అవ్వాలనే కోరిక వుండేది. త్వరలో మా వాడి గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తాను అని అన్నారు.