ఆదిత్యచోప్రాతో కలిసి చిరంజీవి, పవన్, చెర్రీ, అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ తీస్తా: సుబ్బరామిరెడ్డి
''చిరంజీవితో 'స్టేట్‌రౌడీ' తీశాను. ఇప్పటికి 14 సినిమాలు నిర్మించా. అందులో మల్టీస్టారర్ కూడా వుంది. ఖైదీ నెం. 150 ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో భారీ సినిమా త్వరలో తీస్తానని ప్రకటించా. దానికి అశ్వనీదత్ భాగస్వామి అవుతారు. త్వరలో వీరందరినీ వ్యక్తిగతంగా కలుస్తానని'' టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. 'ఆత్మీయ వేడుక' పేరుతో గురువారం రాత్రి పార్క్ హయత్‌లో చిరంజీవి దంపతులను, ఖైదీ నెం. 150 టీమ్ వినాయక్, రామ్ చరణ్ ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొమ్మిదేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చినా వారం రోజుల్లో వంద కోట్లపైగా వసూళ్లను రాబట్టిన చిరంజీవి స్టామినాను కొనియాడారు. తెలుగు సినిమా మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్యచోప్రాతో కలిసి ఉమ్మడిగా ఒక తెలుగు సినిమా తీయాలని చర్చించాం. ఆయనతో కలిసి తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాలు తీస్తానని ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల, అఖిల్, అల్లు అరవింద్, నాగబాబు, పరుచూరి బ్రదర్స్, జయప్రద, చార్మి, బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.