ఆమని వంటి సీనియర్ నటితో భార్యభర్తల అనుబంధాన్ని తెలియజేసే కాన్సెప్ట్‌తో నిర్మించిన చిత్రం 'ఐపీఎసీ సెక్షన్ భార్యా బంధు'. పలు చిత్రాలకు దర్శకత్వశాఖలో అనుభవమున్న రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 30వ తేదీ శుక్రవారం విడుదలైంది. 'సేవ్ మెన్ ఫ్రమ్ విమెన్' అన్నది ట్యాగ్ లైన్ పెట్టి ఏం చెప్పదలిచారో చూద్దాం.
కథ:
వినాయకరావు (శరత్‌చంద్ర) భార్యాబాధితుల తరపున వాదించే లాయర్. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 498ఏ యాక్ట్‌ను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తూ పురుషుల్ని చిత్రహింసలు పెడుతున్నారనీ, అందుకే దాన్ని సవరించాలని వినాయక రావు పలు కేసుల్లో వాదిస్తుంటారు. కానీ ఆయన వాదించిన కేసులన్నీ వీగిపోతాయి. ఎలాగైనా తననుకుంది సాధించాకే వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో చిత్రమైన పరిస్థితిలో శ్రుతి (నేహా దేశ్‌పాండే)తో కీచులాటలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. సరిగ్గా తన ప్రేమను వ్యక్తం చేసే సమయానికి శ్రుతి.. వినాయక రావును ద్వేషిస్తుంది. దానికి కారణం ఏమిటి? అసలు వినాయకరావు 'సేవ్ మెన్ ఫ్రమ్ విమెన్' అనేది ఎందుకంటున్నాడు? దానికి ప్రధాన కారణం ఏమిటి? అనేది సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ:
నటుడిగా కొత్తవాడైనా లాయర్ పాత్రలో శరత్‌చంద్ర ఫర్వాలేదనిపించాడు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్ నుంచి వ్యక్తి కాబట్టి కొన్ని చోట్ల నటనను కనబరిచాడు. నేహా దేశ్‌పాండే గ్లామర్‌తోపాటు పాత్ర మేరకు నటించింది. వాసు ఇంటూరి, రాగిణి వారి పాత్రుల ఈజీగా పోషించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదు. వేదాలు పుట్టిన భారతదేశంలో వివాహవ్యవస్థ ఎలా ఉంటుందనేది.. పాట ద్వారా ఆమని పాత్రతో చెప్పించారు. తను కౌన్సిలింగ్ చేసే వ్యక్తిగా నటించింది. దర్శకుడిగా తననుకున్న పాయింట్‌ను సింపుల్‌గా చెప్పే ప్రయత్నం రెట్టడి శ్రీనివాస్ చేశాడు. మూసధోరణితో కూడిన కథలు, కమర్షియల్ ఫార్మెట్ చట్రాల నుంచి నిర్మాత సాంబశివరావు అభిరుచి మేరకు తీసిన చిత్రమిది. చెప్పేవిధానంలో ఎక్కడా తడబాటు కన్పించలేదు. హీరో అన్నగా మధునందన్ నటన, ఆయనతో కూడిన సన్నివేశాలు కథకు బలాన్ని చేకూర్చాయి.
ఒకప్పుడు వివాహవ్యవస్థ ఎలా వుండేది. ఇప్పుడు ఎలా మారిపోయిందనేది సన్నివేశపరంగా డైలాగ్స్ ద్వారా దర్శకుడు చెప్పాడు. భార్యల్ని భర్తలు హింసిస్తున్నారని ప్రభుత్వం చేసిన బిల్లు 498ఏ. దాన్ని కొందరు మహిళలు ఏవిధంగా దుర్వినియోగం చేస్తూ తమ ఇగోలతో తమ కుటుంబాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారనేది మధునందన్ ప్రేమ ద్వారా తెలియజెప్పాడు. టెక్నాలజీ ముసుగులో తమ పెళ్లికూడా ఎప్పుడు జరిగిందో తెలీని స్థితిలో ఫోన్‌లో చూసి చెప్పే సన్నివేశాలు ఇప్పటి యువతను అర్థం పట్టేవిధంగా చెప్పాడు. భార్యభర్తలంటే రెండు శరీరాలైనా ప్రాణం ఒక్కటే. అదే నిజమని ఆమని పాత్రద్వారా చెప్పడం బాగుంది. ఒకప్పుడు ప్రేమతో రిలేషన్స్ ముడిపడివుండేవి. ప్రస్తుతం మనీతో వుంటున్నాయి. దాన్నుంచి బయటపడాలని తెలియజెప్పే చిత్రమిది.
ప్లస్‌పాయింట్లు:
1. కథాబలం
2. సందేశం
3. సంగీతం
మైనస్‌లు:
ఎంటర్‌టైన్‌మెంట్.
ముగింపు: ఈ చిత్రం ఇప్పటి యువత చూడతగ్గది. తమను తాము ఐడెంటిఫై చేసుకునేట్లుగా వుంది.