సౌత్ సినిమాల విజ‌యాల‌పై బాలీవుడ్ ఈర్ష‌తో వుందా?

గురువారం, 28 ఏప్రియల్ 2022 (17:15 IST)
Ajay-sudeep
ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమా అనేపేరు మారుమోగుతోంది. అయితే అందులో ఉత్త‌రాది సినిమా ఒక్క‌టి కూడా లేక‌పోవ‌డం విశేషం. ద‌క్షిణాది సినిమాలైన బాహుబ‌లి త‌ర్వాత ఆర్‌.ఆర్‌.ఆర్‌., కెజిఎఫ్‌., పుష్ప చిత్రాలు తారాస్థాయిలో దూసుకుపోతుంటే బాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు గుర్రుమంటున్నారు. అస‌లు డ‌బ్బింగ్ సినిమాలు ప్రాంతీయ సినిమాలే. వాటిని పాన్ ఇండియా సినిమాలు అన‌కూడ‌దు అంటూ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. ఇందులో అజయ్‌ దేవ్‌గన్, కిచ్చా సుదీప్, అభిషేక్ బ‌చ్చ‌న్ పేర్లు వినిపిస్తున్నాయి. 
 
హిందీ భాష ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ పై అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించాడు. ఇక సుదీప్ కూడా మీరు హిందీలో ఇచ్చిన రిప్లైని నేను చదవగలిగాను. మరి నేను కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి? అంటూ  కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా నేను ఆ మాటను అన్న సందర్భం వేరు, అది మీకు చేరిన విధానం వేరు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అజయ్ కూల్ అవుతూ అన్ని భాషలనూ గౌరవిస్తాము. భారతీయ సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటే అంటూ కాంట్రవర్సీకి ముగింపు పలికారు.  
ఇందుకు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కూడా క‌లుగ‌జేసుకుని, “అజయ్ నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు.  భాషలు ప్రాంతీయ, సాంస్కృతిక అనుకూలతలను బట్టి పెరుగుతాయి. అంతేకాదు ఏకీకృతం చేయడానికి, విడిపోవడానికి ఉద్దేశించబడ్డాయి” అంటూ అజయ్ దేవగన్ ను ట్యాగ్ చేశారు. ముఖ్యంగా బాలీ వుడ్, శాండల్ వుడ్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు కనిపిస్తున్న సమయంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు” అంటూ అన్నారు.
 
బాలీవుడ్‌లో  కన్నడ డబ్బింగ్ చిత్రం  KGF2 50 కోట్ల ఓపెనింగ్ డేని సాధించింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌., పుష్ప చిత్రాలుకూడా బాగా వ‌సూలు చేశాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఎగ్జిబిట‌ర్లు, పంపిణీదారులు కూడా ద‌క్షిణాది సినిమాలు లేక‌పోతే తామెంతో న‌ష్ట‌పోయేవార‌ని పేర్కొన‌డం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు