రుద్రమదేవి వంటి సినిమాలకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, నందమూరి హీరో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. చరిత్రను వక్రీకరించిన సినిమాకు ఏ ప్రాతిపదికన మినహాయింపు ఇస్తారని ప్రశ్నించారు. ఇదే అంశాలపై తాను పోస్టులు చేస్తే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.
తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి శ్రీకాకుళం వరకు అన్నిటిపైనా పోస్టులు పెట్టానని అన్నారు. ఇలాంటి పోస్టులతోనే నిజానికి ఇప్పుడే తన ఫేస్ బుక్ పేజీకి పబ్లిసిటీ వచ్చిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను ఇలా చేస్తున్నానని అందరూ చెప్తున్నారని.. ఎన్నికల బరిలోకి దిగేందుకు తన వద్ద అర్థబలం కానీ, అంగబలం కానీ లేవన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు చేశారని ఆరోపిస్తూ ఐవైఆర్‌పై సర్కారు వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఐవైఆర్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. అన్నం పెట్టిన చేతికి అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి ఐవైఆర్ అని బుద్ధా ఫైర్ అయ్యారు. ఐవైఆర్ అహంకారంతో ఇలా మాట్లాడుతున్నారని.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.