బాద్‌షా, టెంపర్, బృందావనం వంటి సినిమాల్లో హిట్ పెయిర్‌గా పేరు కొట్టేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్-కాజల్ అగర్వాల్ జోడీ జనతా గ్యారేజ్‌లోనూ కనిపించనుంది. అయితే కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ సరసన ఫుల్ మూవీలో హీరోయిన్‌గా కనబడదు. ఈ సినిమాలోని ఓ పాటకు కాజల్ అగర్వాల్ డ్యాన్స్ చేయనుందని తెలిసింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ పతాకంపై "జనతా గ్యారేజ్" తెరకెక్కుతోంది.
సమంత, నిత్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీమంతుడు ఫేమ్... కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ కాలు కదుపనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
ఇప్పటివరకు తమన్నా, శ్రుతి హాసన్, అనుష్క లాంటి అగ్ర కథానాయికలంతా ప్రత్యేక గీతాల్లో ఆడిపాడారు. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం తొలిసారిగా,''జనతా గ్యారేజ్"తోనే ప్రత్యేక గీతంలో నర్తించనుంది. తొలుత ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాని ఎంపిక చేసినట్లు ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతం సినీ యూనిట్ కాజల్ పేరును ప్రకటించింది. ఇక కాజల్‌పై స్పెషల్ సాంగ్‌ను ఆగస్టు ఒకటో తేదీ నుంచి కేరళలో షూట్ చేయనున్నారు. కాగా కాజల్ అగర్వాల్‌ను ఎన్టీఆరే సిఫార్సు మేరకే స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి.
మిర్చి, శ్రీమంతుడు సినిమాల్లో ప్రభాస్, మహేష్ ఎలా అనుష్క, శ్రుతిహాసన్‌ల కాళ్లను టచ్ చేశారో.. అలానే ఎన్టీఆర్ కూడా సమంత కాళ్లు పట్టుకునే సీన్ జనతా గ్యారేజ్‌లో ఉంటుందని.. కొరటాల శివ సెంటిమెంట్ పరంగా ఈ సీన్‌ను పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఇదే తరహాలో ఎన్టీఆర్ కూడా బాద్ షా, టెంపర్ వంటి సినిమాల్లో కాజల్ సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో ఆమె కోసం స్పెషల్ సాంగ్ పెట్టేలా చేశాడని టాక్ వస్తోంది.