ఆయన దయ వల్లే కీర్తి ప్రతిష్టలతో కార్లలో తిరుగుతున్నాము : :జానీ మాస్టర్
గురువారం, 19 అక్టోబరు 2023 (18:28 IST)
Johnny Master, KL Damodara Prasad and others
తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు ఆయన కొరియోగ్రఫీ అందించారు. కన్నడలో సుదీప్ 'రా రా రక్కమ్మ', హిందీలో సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'లో మూడు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న జానీ మాస్టర్ ప్రమాణ స్వీకారానికి తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచి డ్యాన్స్ డైరెక్టర్లు వచ్చారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు & ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు.
కెఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ''ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు. అయితే, ఎవరెవరు పోటీ చేశారో తెలియదు. జానీ ఫోన్ చేసి గెలిచానని చెప్పారు. కంగ్రాట్స్ చెప్పా. పాత బాడీ కావచ్చు, కొత్త బాడీ కావచ్చు... ఎవరైనా సరే యూనియన్ సభ్యుల మంచి కోసం పని చేయాలి. గతం గతః. ఏం చేస్తే మంచిదో ఆలోచించాలి. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, వాణిజ్య మండలి కార్యదర్శిగా నా మద్దతు డ్యాన్సర్స్ యూనియన్ సభ్యులకు ఎప్పుడూ ఉంటుంది. పాత తరం వాళ్ళను మర్చిపోవడం చాలా ఈజీ. ముక్కు రాజు గారి కుటుంబ సభ్యులను, పాత వాళ్ళను తీసుకు రావడం నాకు సంతోషంగా అనిపించింది. సౌత్ అంతా ఒక్కటే అని, ఒక్క తాటిలో ఉండాలని చెబుతుంటా. అందరూ కలిసి ఉండాలి. పని చేసుకోవాలి. ఈ రోజు తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి డ్యాన్స్ మాస్టర్లు రావడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ ''బెంగళూరు నుంచి హరీష్, మంజునాథ్, సురేష్ వచ్చారు. వాళ్ళకు థాంక్స్. ఫెడరేషన్ నుంచి అందరూ వచ్చి దీవించారు. వాళ్ళకు థాంక్స్. మా కొరియోగ్రాఫర్స్ వచ్చారు. ఈ రోజు మాకు ఇంత పేరు, ఫేమ్ వచ్చి కార్లలో తిరుగుతున్నామంటే ముక్కురాజు మాస్టర్ దయ వల్లే. ఆయనకు థాంక్స్. మేం పిలవగానే ఆయన వంశం నుంచి ఒకరు వచ్చారు. అందుకు థాంక్స్. మా యూనియన్ తరఫున ఆయన వారసురాలికి చిరు కానుకగా రెండు లక్షల రూపాయలు అందజేస్తున్నాం. చెక్ కాకుండా డైరెక్ట్ క్యాష్ ఇస్తున్నాం. ఇవాళ యూనియన్ ఈ స్థాయిలో ఉందంటే కారణం ఆయన. ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ప్రకాష్ అన్న, శ్రీధర్ మాస్టర్... డ్యాన్స్ యూనియన్లో అందరూ ఒక్కటే. మేమంతా ఒక తల్లికి పుట్టిన బిడ్డలం. డ్యాన్స్ యూనియన్ అభివృద్ధికి ఏం చేయాలనేది అందరం ఆలోచిద్దాం. ఇంతకు ముందు చెప్పినట్టు ల్యాండ్ తీసుకొస్తా'' అని అన్నారు.
మద్రాస్ డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ దినేష్ మాస్టర్ మాట్లాడుతూ ''జానీ ఇకపై వెనక్కి తిరిగి చూడవచ్చు. ముందుచూపుతో డ్యాన్స్ యూనియన్ సభ్యుల మంచి కోసం ఏం చేయాలని ఆలోచించు. వెనక్కి చూస్తే బండి ముందుకు వెళ్ళదు. మీతో పాటు సీనియర్లను కూడా తీసుకు వెళ్ళాలని రిక్వెస్ట్'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన డ్యాన్స్ డైరెక్టర్లు కూడా మాట్లాడారు.