అయితే ఓ చిన్న విషయాన్ని ఈ వేదికపై నిల్చుని చెప్పాలనుకుంటున్నానని.. తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటూ ఎన్టీఆర్ క్రిటిక్స్‌పై ఫైర్ అయ్యాడు. ఎమెర్జీన్సీ వార్డులో ఉన్న పేషెంట్‌ను ఎంతో నైపుణ్యం వున్న, నేర్పు కలిగిన డాక్టర్లు చికిత్స అందిస్తుంటారు.
అంత నైపుణ్యం కలిగిన వైద్యులు... పేషెంట్ బంధువులతో పరీక్షలన్నీ చేయించాక.. ఆ పేషెంట్‌పై ఆశలు పెట్టుకోవచ్చా? లేదా? అని చెప్తాం అంటారు. ఇంతలో అటుగా వెళొచ్చే వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. ''బతకడు.. పోతాడు'', ఇంపాజిబుల్..అవుట్’ అని అంతా వాళ్లకు తెలిసినట్టే అంటూ ఉంటారు. ఎంతో నేర్పు కలిగినటువంటి వైద్యులు చెప్పనటువంటి మాటలు వీళ్లు మనకు చెప్తుంటారు.
ఇలాంటి మాటలతో చావుబతుకుల్లో ఉన్న వాడిని చంపేయడం, వాడిపై ఆశలు పెట్టుకున్న వాళ్లను చంపేయడం చేస్తుంటారు. ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది. ఒక చిత్రం విడుదలైతే, అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఓ పేషెంట్ లాంటిది. వాడు బతుకుతాడా? చస్తాడా? అనుకునే చుట్టాలం మేము. డాక్టర్లు ప్రేక్షకులు. దారిన పోయే దానయ్యలు కొంతమంది విశ్లేషకులు. అరే, అసలు సినిమా చచ్చిపోయిందో లేదో ప్రేక్షకులు చెబుతారు. వారు చెప్పాక ఆ సినిమా పేలలేదంటే ఒప్పుకుంటాం.. ఆశలు వదులుకుంటామని ఎన్టీఆర్ ఘాటుగా క్రిటిక్స్‌పై ఫైర్ అయ్యారు.
అయితే ఎన్టీఆర్ వ్యాఖ్యలపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఖండించాడు. సినిమాలపై విమర్శలు చేయడం అనేది సినిమాని బట్టే వుంటుందని, క్రిటిక్స్ బట్టి సినిమాలు తయారయ్యే పరిస్థితి వుండదన్నాడు. సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని.. వాళ్ల అభిప్రాయాల వెల్లడించేవాడే క్రిటిక్ అంటూ వ్యాఖ్యానించాడు.
ప్రేక్షకుడు తన అనుభూతిని మాత్రమే చెబుతాడని... క్రిటిక్ తన అనుభూతినే కాకుండా, ఆలోచనలను కూడా పంచుకుంటాడని తెలిపాడు. అలాంటప్పుడు ప్రేక్షకుడికి ఉన్న హక్కు, క్రిటిక్‌కు లేదనడం సబబు కాదని కత్తి మహేష్ ఖండించాడు. క్రిటిక్ అభిప్రాయం వల్లే సినిమా ఆడలేదనే విషయాన్ని తాను నమ్మనని తెలిపాడు.