తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం ఈనెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే, కర్ణాటకలో మాత్రం ఈ చిత్రం విడుదల అనుమానాస్పదంగా మారింది. ఈ చిత్రాన్ని విడుదల కానివ్వబోమని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రకటించింది. దీంతో కన్నడనాట 'కాలా' విడుదల అనుమానాస్పదంగా మారింది.
కావేరి జలాల విషయంలో రజినీకాంత్ పూర్తిగా తమిళులకి మద్దతు ఇచ్చారు. దీంతో ఆయన చిత్రాలకు ఇపుడు కన్నడనాట సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 'కాలా'ను కర్ణాటకలో విడుదల కానివ్వబోమంటూ పట్టుబట్టుకు కూర్చున్నారు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి. ఇప్పుడు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా 'కాలా' సినిమా కర్ణాటకలో విడుదల కావడం అసంభవమంటూ కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి ఉద్ఘాటించారు.
ఈనేపథ్యంలో రజినీకాంత్ 'కాలా' విడుదలపై స్పందించారు. ''కర్ణాటకలో 'కాలా' సమస్యలని ఎదుర్కోదు అని నేను అనుకోను. కర్ణాటకలో కేవలం తమిళ ప్రజలు మాత్రమే కాదు, ఇతర భాషలను మాట్లాడేవారు ఉన్నారు. వారు ఈ సినిమాని చూడాలనుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం థియేటర్లకు, ప్రేక్షకులకు తగిన రక్షణ కల్పిస్తుందని నేను భావిస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు.