తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఈ చిత్రం వచ్చే నెల ఏడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అయితే, ఈ చిత్ర యూనిట్‌కు కన్నడ చిత్ర పరిశ్రమ తేరుకోలేని షాకిచ్చింది.
ఇటీవలి రజినీకాంత్ కావేరీ వివాదంపై తమిళనాడుకు అనుకూలంగా మాట్లాడారు. ఇది కన్నడికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో కాలా సినిమాను కన్నడనాట బ్యాన్ చేశారు. కర్ణాటకలో రజనీకాంత్ సినిమాలు ఆడనివ్వబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్ హెచ్చరించారు. అలాగే, రజినీకాంత్ సినిమాను విడుదల చేయొద్దని ఆయన థియేటర్స్ యజమానులకు, డిస్టిబ్యూటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే, జూన్ 7వ తేదీ తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కాలా మూవీ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, ఒక్క కర్ణాటకలో మాత్రం బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ మొత్తంలో ఈ మూవీ అక్కడ అమ్ముడుపోయింది.