తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. జమ్మూలో కొందరు యువకులు జవాన్లపై దాడి చేసిన అంశంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
ఈ అంశంపై సినీనటుడు కమలహాసన్ ఘాటుగా స్పందించారు. జవాన్లపై చేయిచేసుకోవాలనుకోవడం సిగ్గుచేటని తెలిపారు. ఎవరు అలాంటి ప్రయత్నం చేశారో వారికే అది అవమానమని ట్విట్టర్లో పేర్కొన్నారు. అహింసే శౌర్యానికి పరాకాష్ట అని, దీనికి సీఆర్‌పీఎఫ్ జవాను ఉదాహరణగా నిలిచాడని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ యువకులు చేయిచేసుకున్నప్పటికీ జవాన్లు ప్రదర్శించిన సహనం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ క్రిమినల్ కూటమంతా ఒక చోట చేరిందని మండిపడ్డారు. శశికళ వర్గం నుంచి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఊహించినట్లుగా జరగలేదని వ్యాఖ్యానించారు. ఇంకా మహాభారతంపై కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో జవాన్ల దాడిపై కమల్ స్పందించారు.