క్రిష్ గారూ.. కొంచెం ప్రశాంతంగా వుండండి.. కంగనాను ఒంటరిగా వదిలేయండి...
సోమవారం, 28 జనవరి 2019 (17:09 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఝాన్సీరాణి లక్ష్మీభాయ్ జీవిత ఆధారంగా ''మణికర్ణిక'' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆపై కంగనాతో జరిగిన గొడవ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని టాక్ వచ్చింది.
అరుంధతి విలన్ సోనూసూద్ పాత్ర వ్యవహారంలో ఏర్పడిన వాదనతో ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ వైదొలగాడని టాక్ వచ్చింది. అయితే క్రిష్ తప్పుకున్న తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి.. మణికర్ణికను కంగనా ముగించింది. చివరికి జనవరి 25వ తేదీన మణికర్ణిక బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో విడుదలైంది.
తాజాగా మణికర్ణిక గురించి క్రిష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా మొత్తం గత ఏడాది జూన్‌లోనే పూర్తి అయ్యిందని.. ఈ సినిమాను కంగనా నచ్చిందని చెప్పింది. కంగనా కొన్ని మార్పులు చేయమంది. ఉన్నట్టుండి సోనూసూద్ పోషించిన సదాశివరావు పాత్రను ఇంటర్వెల్ పాయింట్‌లోనే చంపేయాలన్నారు.
కానీ అలా చేయడం చరిత్రను వక్రీకరించడమేనని తాను వాదించానని క్రిష్ చెప్పారు. సోనూసూద్ పాత్ర కోసం చాలా పెద్ద వాదన జరిగింది. దీంతో తాను దర్శకత్వం నుంచి తప్పుకున్నాను.
తర్వాతే నిర్మాత కమల్ జైన్ కంగనా డైరక్ట్ చేస్తుందని చెప్పారని క్రిష్ చెప్పుకొచ్చారు. సోనూసూద్ పాత్ర నిడివిని బాగా తగ్గించేయడంతోనే అతను ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. చాలా విషయాల్లో కంగనా మూర్ఖంగా ప్రవర్తించింది. అందుకే తాను, సోనూ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నామని క్రిష్ తెలిపారు.
మణికర్ణిక సినిమా దర్శకత్వంలో తొలి క్రిడిట్ తన పేరు వేసుకుని.. తనకు సెకండ్ క్రెడిట్ ఇచ్చారు. మరొకరి క్రెడిట్ ఆమె తీసుకుని ఎలా నిద్రపోతోందో అర్థం కావడం లేదని.. అందుకు ఆమె అర్హురాలు కాదన్నారు క్రిష్.
ఇలా కంగనా రనౌత్‌పై క్రిష్ చేసిన వ్యాఖ్యలపై ఆమె సోదరి రంగోలి చందేల్ స్పందించింది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిషే వహించారని ఒప్పుకుంటున్నా. కొంచెం ప్రశాంతంగా వుండండి అంటూ హితవు పలికింది. కానీ ఈ సినిమా ప్రధాన పాత్ర కంగనాదేనని.. ఆమెను ఒంటరిగా వదిలేయండి. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేయనివ్వండి అంటూ ట్వీట్ చేసింది.