బాహుబలి చిత్రాన్ని కర్నాటకలో విడుదల చేయకుండా అడ్డుకుంటామనీ, కన్నడిగులను దూషించిన సత్యరాజ్(కట్టప్ప) సారీ చెబితేనే వదులుతామంటూ బెంగళూరులో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న చిత్రం విడుదల కానుండగా, అదే రోజు బంద్ నిర్వహిస్తామని వారు స్పష్టం చేసారు. దీనితో సత్యరాజ్ రంగంలోకి దిగారు. తను కర్నాటక, కన్నడిగులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదనీ, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరాడు. దీనితో బాహుబలి విడుదలకు దాదాపు అడ్డంకులు తొలగిపోయాయి.
తను ముందుగా తమిళవాడిననీ, ఆ తర్వాత సినీ నటుడునని అన్నారు. తమిళుడిగా తను అన్నమాటలు ఎవరినైనా బాధించి వుంటే క్షమించాలని కోరారు. కాగా రాజమౌళి కూడా కన్నడ ప్రజలను బాహుబలి చిత్రం విడుదలకు అడ్డంకులు సృష్టించవద్దని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపైన ఎన్నో వందల కుటుంబాలు ఆధారపడి వున్నాయనీ, వారి పొట్ట కొట్టవద్దని ఆయన సోషల్ మీడియాలో వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.