చిరంజీవి కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలిరోజు చిత్ర కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. తెలుగు సినిమాల్లో తొలిరోజు అత్యధికంగా గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా 'ఖైదీ నంబర్ 150' నిలిచిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.47.07 కోట్లు వసూలు చేసిందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.30.04 కోట్లు, కర్ణాటకలో రూ.4.72 కోట్లు, ఒరిస్సాలో రూ.12 లక్షలు, తమిళనాడులో రూ.20 లక్షలు, ఓవర్సీస్ (అమెరికా) 1.22 మిలియన్ డాలర్లు (రూ.8.9 కోట్లు), మిగిలిన దేశాల్లో సుమారు రూ.2.12 కోట్లు వసూలు చేసిందని వివరించారు. ప్రీరిలీజ్ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి నిర్మాత రామ్‌చరణ్ ఒకరోజు ముందే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారన్నారు. గతంలోలా కాకుండా రెండు, మూడు వారాల్లో కలెక్షన్లు పూర్తవుతున్నాయన్నారు. తనకు తెలిసి సుమారు 2 వేల తెరలపై చిత్రాన్ని ప్రదర్శించారని తెలిపారు. కాగా, ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ రూ.103 కోట్లుగా జరిగిన విషయం తెల్సిందే.