గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్, అమరావతి, మంగళగిరి తదితర చోట్ల తొలి, మలి షెడ్యూల్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ -``భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది. మద్రాసులో ఉన్నప్పటి నుంచి సుపరిచితం. ఈ సినిమాలో నటించే చిన్నా, బెనర్జీ తదితరులంతా స్నేహితులే. నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉంది. తారకరత్న ఓ పవర్‌ఫుల్ ఏసీపీగా నటిస్తున్నారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నాం. అలాగే సినిమాలో ఐదు పాటలున్నాయి. శేఖర్ మాష్టర్ కొరియోగ్రఫీ, గౌతంరాజు గారు ఎడిటింగ్ చేస్తున్నారు. గోపి మోహన్ - కోన వెంకట్ పర్యవేక్షణలో భవానీ ప్రసాద్ మాటలు అందించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది`` అని తెలిపారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ-``కట్టా రాంబాబు మద్రాసులో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఈ కథ రాసుకుని దీనికి పాత్రధారుల కోసం వెతుకుతున్నప్పుడు రాంబాబు గారు నయీమ్ పాత్రకు సూటబుల్ అనిపించి ఎంపిక చేసుకున్నాం. నటనపై ఆయనకు ఎంతో ఆసక్తి ఉండడం వల్ల అంగీకరించారు. ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులు నాకు బాగా తెలిసినవారు. అందువల్ల ఔట్‌పుట్ బాగా తీసుకోగలననిపించింది. కచ్ఛితంగా విజయం సాధించే చిత్రమిది. అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు`` అన్నారు. బాహుబలి ప్రభాకర్ మాట్లాడుతూ-``టైటిల్ బావుంది. మూడు రోజులు నటించే పాత్ర ఉంది చేయమన్నారు. పాత్ర నచ్చి ఓకే చెప్పాను. మంచి పేరు తెచ్చే రోల్ ఇది`` అన్నారు.