తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటీఆర్ అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్‌లకు వస్తుండటం.. సినిమాల గురించి ట్వీట్ చేస్తుండడం తెలిసిందే. సినిమాలతో టచ్‌లో ఉంటున్న కెటీఆర్ ఓ మూవీ టైటిల్ విని భయపడ్డారట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటారా? ఈ నగరానికి ఏమైంది. పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్తవాళ్లతో తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సురేష్ బాబు నిర్మించారు.
విభిన్న కథాంశంతో రూపొందిన ఈ నగరానికి ఏమైంది చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రతి సోమవారం చేనేత కళాకారులకు మద్దతుగా వారిని ప్రోత్సహిస్తూ చేనేత వస్త్రాలను ధరించాలని భావించాం.
ఈ కార్యక్రమానికి తరుణ్ భాస్కర్ ఆహ్వానిస్తూ.. ‘ఈ నగరానికి ఏమైంది?’ ఈవెంట్‌కి అందరూ చేనేత వస్త్రాలను ధరించే వస్తామన్నారు. అయితే కొంత ఛీటింగ్ చేశారు కానీ.. పాటించినందుకు ధన్యవాదాలు. ఈ నగరానికి ఏమైంది టైటిల్ విని నేను భయపడ్డా.. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే సాధారణంగా పేపర్స్‌లో ‘ఈ నగరానికి ఏమైంద’ని రాస్తారు. అందుకే భయపడ్డా అని చెప్పారు. ఈ చిత్రం కూడా పెళ్లి చూపులు కంటే పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.