అనంతరం బాలశౌరి మాట్లాడుతూ– సినిమా పరిశ్రమలో పౌరాణిక, జానపద, చారిత్రక, సంఘీక చిత్రాలు అనే తారతమ్యాలు లేకుండా దాదాపు ఆరు దశాబ్దాలుగా నటునిగా తన సేవలను అందించారు కైకాలగారు. గతంలో యస్వీ రంగారావు గారు ఉండేవారు. తర్వాత కైకాల సత్యనారాయణ గారు తన నటనతో ఆయనలేని లోటును భర్తీ చేశారు.
భౌతికకాయాన్నిమోసుకుంటూ వెళ్లి...
సత్యనారాయణ గారి భౌతికకాయాన్ని చితివరకు మోసుకుంటూ వెళ్లి తుది నివాళులు అర్పించారు నిర్మాత అల్లు అరవింద్, యంపీ బాలశౌరి, టీటీడి బోర్డు మెంబర్, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీవిత, నిర్మాతలు ఏడిద రాజా, పి.సత్యారెడ్డి, దర్శకులు నక్కిన త్రినాధరావు, రాజా వన్నెం రెడ్డి, మాదాల రవి, ప్రజాగాయకుడు గద్దర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, నటి ఈశ్వరీరావు, శివకృష్ణ తుది నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. చివరిగా (చితికి) పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అశ్రు నయనాలతో నిప్పంటించగా ప్రభుత్వ లాంఛనాలతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి కైకాల సత్యనారాయణ గారి అంతిమ సంస్కారాలని గౌరవంగా ముగించి ఆయన్ను సాగనంపారు.