అప్ప‌టి అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి మ‌రుధూరి రాజా

శుక్రవారం, 25 మార్చి 2022 (15:17 IST)
Alluri- Krishna
1974లో కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామరాజు విడుద‌లైంది. జ‌న ప్ర‌వాహంలా థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌చ్చారు. ఇప్పుడు 2022లో ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా విడుద‌ల రోజు థియేట‌ర్ల‌లో ప‌రిస్థితి అలానే వుంది. అయితే అప్ప‌ట్లో ఎన్‌.టి.ఆర్‌. చేయాల‌నుకున్న అల్లూరి పాత్ర చేయ‌లేక‌పోయారు. కృస్ణ చేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న వార‌సుడు జూ.ఎన్‌.టి.ఆర్‌.కూడా చేయ‌లేక‌పోయాడు. రామ్‌చ‌ర‌ణ్ చేశాడు. ఇప్ప‌టికే చాలా చోట్ల అల్లూరి సీతారామ‌రాజు జెండాల‌తో హైద‌రాబాద్‌లోని ప‌లుచోట్ల ఆంధ్ర‌లో మిగిలిన చోట్ల బైక్ రాలీలు నిర్వ‌హిస్తున్నారు. సినిమా విడుద‌ల‌కుముందు అల్లూరి వార‌సులు మా నాయ‌కుడిని త‌ప్పుగా చిత్రిస్తే ఆర్‌.ఆర్‌.ఆర్‌.ని ఆపేస్తామ‌నీ కోర్టుకు వెళ‌తామ‌ని స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ విడుద‌ల‌య్యాక సీన్ మారింది. ఆయ‌న వార‌సులు అన్న‌వారే కీర్తిస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీ అనుబంధ సంస్థ ఈ సినిమాను భుజాన‌మోస్తోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత మ‌రుధూరి రాజా అప్ప‌టి సినిమా గురించి ఇలా తెలియ‌జేస్తున్నారు.
 
1974..మే 1
ఒంగోలు..
శ్రీనివాస థియేటర్..!
థియేటర్ ముందు
జన తుఫాన్..!
"అల్లూరి సీతారామరాజు "చిత్రం రిలీజ్..! 
అప్పటికే సంచలన చర్చలు..!
" కృష్ణ ..సీతారామరాజేంటి..మరీ చిరాగ్గా..!
వేస్తే N.T.R వెయ్యాలి.!"
ఇది రామారావుగారి అభిమానుల వాదన,తీర్పు..!
"చేస్తే మా కృష్ణే చెయ్యాలి..!"
కృష్ణ గారి అభిమానుల ఆవేశం.
మధ్య లో మేం హ్యాపీ.
ఎందుకనగా..
మేం A.N.R గారి ఉన్మాత్తాభిమానులం.
N.T.R ఫ్యాన్స్ , కృష్ణ గారి ఫ్యాన్స్ మాటలతో 
కొట్టుకుంటుంటే 
మేం ఘంటసాల గారి పాటలు వింటున్నంత హాయిగా చెవులు బిగించి వినేవాళ్ళం.
వాళ్లలో ఎవరు ఓడినా మాకు హోలీ పండగే.
కానీ యమర్జెన్సీగా సినిమాచూసెయ్యాలి.
ఆ రోజు బెంచీ టికెట్ దొరకటం కంటే 
పార్టీ టికెట్ దొరకటమే ఈజీ.
అయినాసరే చొక్కా గుండీలు ఊడేదాకా జనంమీద సర్జికల్ స్ట్రయిక్ చేసి,
టికెట్ సాధించి, థియేటర్ లోకి ఎంటరయి సీట్లో కూర్చుంటే అదో అద్భుతానందం. హాల్లోజనం..కేకలు,కేరింతలు.
అయిదు నిముషాల తర్వాత వెండితెరకు అమరిన బల్పులు వెలిగి తెర పైకి లేస్తుంటే
ప్రేక్షకుల ఈలలు, గోలలు,తప్పెట్ల సౌండ్ మించిన చప్పట్లు..! 
తెరమీద "పద్మాలయాబ్యానర్"
టైటిల్స్ స్టార్ట్..!
"అల్లూరి సీతా రామరాజు"
పేక్షక జనం జేజేలు..!
" రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు...
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు...!!"
మహాకవి కలం కరవాలమై దూసి రాసిన పాట..
S.P బాల సుబ్రహ్మణ్యం గొంతు శంఖారావం చేస్తుంటే,
ఆ స్వరాలకు ఒళ్లు పులకరాలెక్కి
ప్రతివాడి రోమాలు రామరాజు బాణాలయి పోయాయి..!
అది సినిమానో, సమరమో అర్ధం కావట్లేదు.
సినీ హీరోగా కానివ్వండి,నటుడిగా కానివ్వండి,నిర్మాతగా కానివ్వండి తన డబ్బుని,కెరీర్ ని,పరువుని పణంగాపెట్టి విజయమో,వీరమరణమో అని తెగించి,ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసి
ఆ సినిమాని నిర్మించిన కృష్ణగారు తెరమీదకు రాగానే..
మహాయుద్ధం చెయ్యటానికి వచ్చిన 
సమర యోధుడిలా ప్రతిధ్వనించాడు.
సీతారామ రాజు పాత్రని రక్తి కట్టించి అప్రతిహతంగా నడిపించాడు.
శ్రీ ఆదిన్నారాయణ రావు గారు తనసంగీతంతో
ప్రతీ ప్రేక్షకుడి నరాలని వేడెక్కించి..,
ప్రతీ శరీరాన్ని విప్లవ వీణని చేసిశృతి చేసి వినిపించారు.
రచయిత త్రిపురనేనిమహారధి అక్షరాలలో అణుశక్తిని నింపి సంభాషణలతో సమరం చేశాడు.
ఛాయాగ్రాహకుడు V.S.R స్వామి గారు సప్తవర్ణాల మహా శిల్పాన్ని చెక్కాడు. దర్శకుడు రామచంద్రరావు గారు అన్ని విభాగాలని విజయ మార్గంలో నడిపించాడు.
రామరాజు జీవితం లో ఉందో లేదో తెలియని
" సీత " ఉందీ..అని ఒప్పించేలా,నమ్మించేలా,నటించి మెప్పించేశారు విజయనిర్మలగారు..!
ఇక మిగిలిన పాత్రలుచూడాలి.
గుమ్మడి గారు..ఆవేశం,ఆర్ద్రతా కలిసిన అసమాన నటన..అది ఆయనకే చెల్లింది. ప్రభాకరరెడ్డి, బాలయ్య, త్యాగరాజు,చంద్రమోహన్,K.V చలం,మంజుల ఎటుచూసినా తారాబలమే..నటనా వైభవమే.
"రూధర్ ఫర్డ్'...
బ్రిటీష్ వాళ్ళు వెళ్లి పోతూ
ఒకశక్తి వంతమయిన కలెక్టర్ ని
ఇక్కడేవదిలేసివెళ్ళారా..అనిపిస్తుంది..
జగ్గయ్యగారిని గారిని చూస్తే..!
ఒరిజినల్ రూధర్ ఫర్డ్ ఇంత స్టైలిష్ గా ఇంగ్లీష్ మాట్లాడగలడా..!?
అని నాకు ఇప్పటికీ డౌటే..!
చూపు,మాట,నడక, పిడుగుశబ్దం లాంటి గొంతు.
" మజ్జారే..జగ్గయ్య గారూ..మాకే గర్వం మీరు..!
సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి.
ఈమధ్య మన తెలుగులో,ఇతర రెండు మూడుభాషల్లో వచ్చిన దేశభక్తి వి'చిత్రాలు'చూశాను. 
బ్రిటీష్ విలన్ లందరూ ఫైవ్ స్టార్ హోటల్ ముందు గేట్లు తెరిచే వాళ్ళలా ఉన్నారు.
అఫ్ కోర్స్..
ఎక్కడి నుండో తెచ్చిన గొప్పనటులు కావొచ్చు.
నాలాంటి బెంచి టికెట్ గాడికి తెలియాలి కదా..! 
పక్కన మా పిల్లలని అడిగాను "వాడెవాడు..!?" అని. వాళ్ళు చెప్పారు "వాడే మెయిన్ విలన్" అన్నారు.
"ఎలా తెలుస్తుంది..మెయిన్ విలన్ అని.వాడి చేత నటింప చెయ్యాలి కదా..! పోనీ..కనీసం వాడొచ్చినప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం" అని కింద రాసినట్టు రాయాలి కదా..
" జాగర్త గా చూడండి..
వీడే మెయిన్ విలనూ.!" అని.
దేశభక్తి మీద సినిమా తీయాలంటే..నట,దర్శక,సాంకేతిక వర్గాల్లో కొంత దేశభక్తి ఉండాలి.ప్రేమ వుండాలి.మేం చేస్తున్నామని అహమో, డబ్బు గురించి భయమో ఉంటే తెరమీదకి అదే వస్తుంది.
సంగీతం కూడా అంతే.
ఆదినారాయణ రావుగారి సంగీతం..
థియేటర్ లో కూర్చుని కళ్లు మూసుకున్నా కధ వినిపిస్తుంది.వెంటాడుతోంది.మ్యూజిక్ లో ఎంత స్క్రీన్ ప్లే,ఎంత కనెక్షన్ ఉంటుందో
'సీతారామరాజు' సినిమా నేర్పిస్తుంది.
ముఖ్యంగా స్వాతంత్ర పోరాటం,దేశభక్తి వినిపించడానికి ఏ వాయిద్యాలు వాడాలో 
సెలెక్ట్ చెయ్యటం
"ఆది" నారాయణరావుగారికే చెల్లింది.
చెప్పాను గా రీసెంట్ స్వతంత్ర పోరాట సినిమాల్లో హర్రర్ మ్యూజిక్కు,టెర్రర్ సౌండ్లు వింటున్నప్పుడు
దేశభక్తి కన్నా ప్రాణ భయం ఎక్కువయ్యేది.
ఇది విమర్శ కాదు.వేదన. మంచి విలువలున్న సినిమాలు చూడలేక పోతున్నాం అన్న 
సగటు ప్రేక్షకుడిగా ఆవేదన.
నిజంగా..ఆ రోజుల్లో ప్రేక్షకుడిగా నేనెంత అదృష్టవంతుడిని అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది..!
ఆరోజు సినిమా పూర్తి కావొస్తోంది.
పతాక సన్నివేశాల్లో..
సీతారామరాజు ఆవేశంతో రగిలిపోయాడు.
ఒక మహా శక్తి ని అంతం చేస్తున్నందుకు 
రూధర్ ఫర్డ్ పశ్చాత్తప పడ్డాడు.
తుపాకులు గర్జించాయి.
సీతారామరాజు స్వాతంత్ర నినాదాలు చేస్తూ అస్తమించాడు.
తిరిగి కృష్ణ గారి రూపంలో ఉదాత్త నాయకుడి గా జన్మించాడు.
తెర మీద సినిమా చివరి క్షణాలు నడుస్తున్నప్పడు.
ఏ మహనటుల అభిమానులయినా దేశభక్తి తో ప్రకంపించారు.
కృష్ణగారికి..విప్లవ వందనం చేశారు
వాళ్లలో మేమూ ఉన్నాము.
ఇంత సేపు ఆవేశం తో గుండెలు వేడెక్కించిన 
కృష్ణగారికి, అల్లూరి సీతారామరాజు సినిమాకి చేతులెత్తి నమస్కారం చెయ్యకపోతే 
దేశద్రోహం అవుతుంది.
అందుకే హృదయపూర్వకవందనాలు చేసి
చూసిన అద్భుతాన్ని రక్తంలో జీర్ణించుకుంటూ
థియేటర్ నుండి బయటకు వచ్చాం.. 
శ్రావణమాసం సినిమా షూటింగ్ లో..
కృష్ణ గారిని అడిగాను..!
"సార్..'ఛత్రపతి శివాజీ 'సినిమా తీయండి..!"
ఆయన ఆ సినిమా తీయక పోవటానికి 
ముఖ్య కారణం చెప్పారు.
అమాయకంగా మాట్లాడే ఆయన మాటల్లో ఆలోచనా పరిధి ఎంత ఉంటుందో..! 
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులతో పోరాటం చేసినా....
ఆయన మంచితనం,సూటితనం,
ఎన్నో వేలకుటుంబాలకు ఉపాధి ఇచ్చిన
ఉదాత్త గుణమే ఆయన్ని ఇప్పటికీ 
గెలుపు శిఖరం మీద నిలబెట్టింది..
సినీ నాయకుడిగా, సాహసిగా,మానవత్వం ఉన్న వ్యక్తిగా కృష్ణ గారిని సినిమా చరిత్ర 
తన కిరీటంలోపొదిగి,గర్వపడుతుంది.
 
ఒక రోజు ఆలస్యం చేశాను..
కృష్ణ గారికి విషెస్ చెప్పటానికి..!
పర్వాలేదు..ప్రతిరోజు ఆయనకి శుభాకాంక్షలే..!
కృష్ణగారూ..
మీరు ఎప్పుడూ ఇలాగే ఎన్నో ఏళ్ళు అందంగా ఆరోగ్యంగా, ధైర్యంగా..ఉండి, ఎంతోమంది అభిమానుల ప్రేమ పొందాలి, 
మీ వ్యక్తిత్వం,సాహసం,జీవితం
ఎంతో మంది హీరోలకు మార్గదర్శనం చెయ్యాలి..!
అంటూ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు