జల్లికట్టు వద్దంటావా... సినిమాలు ఎలా తీస్తావో చూస్తామంటూ త్రిషకు బెదిరింపులు

శనివారం, 14 జనవరి 2017 (02:07 IST)
సినిమా తారల జీవితాలు అరిటాకు లాంటివే అని ఊరకే అనలేదు. న్యాయమైన కారణాలతో తమ అభిప్రాయాలు బయటకు చెప్పినా వారికి తిప్పలు తప్పవు. ఏ మాట అంటే ఎవరికి కాలుతుందో, ఏవైపు నుంచి దాడి జరుగుతుందో కూడా తెలీదు. ఈ విషయం దక్షిణాది అగ్రనటి త్రిషకు కాస్త ఆలస్యంగా అర్థమైనట్లుంది.

ఆమె చేసిన తప్పల్లా ఏమంటే తమిళనాడులో శతాబ్దాలుగా కొనసాగుతున్న జల్లికట్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే. దానికి ఫలితం ఏమిటంటే బెదిరింపులు. నువ్వు ఎలా సినిమాలు చేస్తావో చూస్తామంటూ హుంకరింపులు మొదలైపోయాయి. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు ఈ ఇక్కట్లు ఏమిటి అని మల్లగుల్లాలు పడటం ప్రస్తుతం త్రిష వంతైంది. 
 
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా సినీనటి త్రిష ప్రచారం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చెన్నైకు 450 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న త్రిష చిత్ర షూటింగ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. పెటా కార్యకర్తగా ఉన్న త్రిష జల్లికట్టు క్రీడను వ్యతిరేకించారు. 
 
ఈ నేపథ్యంలో శివగంగలో జరుగుతున్న ‘గర్జన’ చిత్ర షూటింగ్‌ పలువురు జల్లికట్టు మద్దతుదారులు అడ్డుకున్నారు. వ్యానులో ఉన్న త్రిష బయటకు రావాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తతతకు దారితీయడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. త్రిష క్షమాపణలు చెప్పడంతో పాటు జంతు సంరక్షణ హక్కుల సంస్థకు ఇచ్చిన మద్దతు వెనక్కి తీసుకోవాలని.. అప్పటివరకూ చిత్రీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి