మీ రికార్డుల సాధనకు, అభిమానుల్లో ఉన్న పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఇంత కక్కుర్తి పడతారా అంటూ కాటమరాయుడు చిత్ర నిర్మాణ సంస్థపై ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్ మండిపడింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే జనాల్లో ఉన్న క్రేజీని సొమ్ము చేసుకోవాలని కాటమరాయుడు సినిమా టిక్కెట్ల ధరను పెంచడాన్ని అసోసియేషన్ తీవ్రంగా నిరసించింది.
విషయం ఏమిటంటే వంద కోట్ల క్లబ్బులో ఎలాగైనా చేరాలనే దుగ్ధ, మొదటి మూడు రోజుల్లోనే 30 కోట్లు సంపాదించలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా తెలుగు సినీ నిర్మాతలు, హీరోలు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈక్రమంలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పది రూపాయల టిక్కెట్టును 50కి, అలాగే 50 రూపాయల టిక్కెట్చును 200లకు, 150 రూపాయల టిక్కెట్టును 500లకు పెంచి లూటీ చేయడం ప్రతి అగ్రహీరో సినిమాకు అలవాటైపోయింది.
కాటమరాయుడు సినిమాను సింగిల్‌గా టార్గెట్ చేయటం కంటే కొత్త సినిమా విడుదలైన మూడు రోజుల్లో ఇలాంటి లూటీ పద్ధతులకు పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఏ చిత్ర నిర్మాతా, హీరో ఇలాంటి తప్పుడు పనులకు పాటుపడరు కదా..