ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేడుకలో బాలకృష్ణ స్వయంగా ''గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ" పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాలకృష్ణ మాట్లాడుతూ, "ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తుంటాము. డాకు మహారాజ్ కోసం కూడా ఎంతో రీసెర్చ్ చేశాము. ఆదిత్య 369 లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ పాత్ర పుట్టింది. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాము. ఆ సినిమా అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమాలు అభిమానులకు నచ్చడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావు గారు నాకు అభిమానుల రూపంలో ఇంతటి కుటుంబాన్ని ఇచ్చారు. ఆయన బిడ్డగా పుట్టడం నా జన్మజన్మల పుణ్యఫలం.
నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నా అభిమానులే నా ప్రచార కర్తలు. వాళ్లకు తెలుసు.. నా రికార్డులన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభావంతుడు. నటీనటుల నుంచి హావభావాలు చక్కగా రాబట్టుకోగలిగాడు. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. ఎంతో బాధ్యతగా అద్భుతమైన సంగీతం అందించాడు. మా కెమెరామ్యాన్ విజయ్ కార్తీక్ గారి విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. యుగంధర్ గారి వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. రచయితలు మోహన్ కృష్ణ గారు, చక్రి, నందు, భాను కలిసి సన్నివేశాలు, సంభాషణలు గొప్పగా రాశారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ దబిడి దబిడి సాంగ్ అదరగొట్టారు. అఖండ నుంచి నాది, ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం మొదలైంది. అందం, నటన కలబోసుకున్న నటి ప్రగ్యా. ఇక శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ లో ఫైర్ బ్రాండ్. గీత రచయితలు అనంత్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమా డాకు మహారాజ్. మంచి సినిమాని ఆదరించి, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు మరోసారి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అన్నారు.